
కూలీల కొరత.. రైతుల వ్యథ
పంట చేతికొచ్చిన సమయంలోనే అడ్డంకులు
ఆత్మకూరు(ఎం): విత్తనాలు వేసింది మొదలుకొని పంట చేతికొచ్చే వరకు రైతులకు నిత్యం ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రారంభంలో వరుణుడు సహకరించకపోవడం, ఆ తరువాత ఎడతెరిపి లేని వర్షాలు, ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు కూలీల కొరత వేధిస్తోంది. కొంతకాలంగా జిల్లాలో కూలీలు దొరకడం కష్టంగా మారింది. రైతులు చేసేది లేక ఇత రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పెరిగిన కూలి
స్థానికంగా కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా కూలీలు వచ్చినా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో తొలి విడత పగిలిన పత్తి తీయడానికి రోజుకు రూ.300 తీసుకునేవారు. ప్రస్తుతం రూ.450 అడుగుతున్నట్లు రైతులు వాపోతున్నారు. పత్తి పగలడం, మరో వైపు మబ్బులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి పత్తి పగలడం, కూలీలు దొరక్కపోవడంతో కొందరు రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పత్తి ఏరుతున్నారు. స్థానికంగా కూలీలు దొరికినట్లయితే ఎక్కువ కూలి డిమాండ్ చేయడంతో పాటు ఆటో చార్జీలు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. చేసేది లేక ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల, బిహార్, జార్ఘండ్ రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. వరి కోతలు కూడా మొదలు కావడంతో ఇతర రాష్ట్రాల కూలీలు రోజుకు రూ.450 తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు.
చేతికొచ్చిన పత్తి
ఫ కూలీల కోసం వెతుకులాట
ఫ పొరుగు మండలాలు, ఇతర
రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్న రైతులు
ఫ పనుల డిమాండ్‌తో పెరిగిన ధరలు
జిల్లాలో 1,13,200 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. చాలా మంది రైతులు భూమి కౌలుకు తీసుకొని పత్తి వేశారు. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. సీజన్ ప్రారంభంలో విత్తనాలు విత్తిన తరువాత సరైన వర్షాలు కురువ లేదు. దీంతో రెండు దఫాలు విత్తనాలు విత్తాల్సి వచ్చింది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు చివరి వరకు అదునుకు వర్షాలు కురవడంతో చేలు ఎదిగి ఆశాజనకంగా కనిపించాయి. కానీ, సెప్టెంబర్ నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు తేమ ఎక్కువై, చేలల్లో నీరు నిలువడంతో పూత రాలి, కాయ నల్లబారి మురిగిపోయింది. నిలిచిన కొద్దిపాటి కాయ పగలి పత్తి చేతికొచ్చిన తరుణంలో కూలీల కొరత వెంటాడుతోంది.