జానపదంలో రాణిస్తున్న నల్లగొండ నాగదుర్గ | - | Sakshi
Sakshi News home page

జానపదంలో రాణిస్తున్న నల్లగొండ నాగదుర్గ

Sep 7 2025 6:49 PM | Updated on Sep 7 2025 7:18 PM

Nalgonda Nagadurga

నల్లగొండ నాగదుర్గ

చిన్ననాటి నుంచి కూచిపూడిలో శిక్షణ

ఇప్పటి వరకు 300 వరకు జానపద పాటల్లో నటన

యూట్యూబ్‌ ఇన్‌ఫూయెన్సర్‌గా గుర్తింపు

నల్లగొండలో కూచిపుడి నాట్యాలయం

చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యంపై మక్కువ. యూకేజీ చదివే సమయంలోనే తల్లిదండ్రులు కూచిపూడి శిక్షణ ఇప్పించారు. ఆ నాటి నుంచి మొదలైన ఆమె డ్యాన్స్‌ ప్రయాణం తన అందం.. అభినయంతో నేడు వందల జానపద పాటల్లో రాణిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది నల్లగొండ పట్టణానికి చెందిన గుత్తా నాగదుర్గ. అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాగదుర్గను శనివారం ‘సాక్షి’ పలకరించగా.. ఆమె తన కేరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే..

రామగిరి (నల్లగొండ) : మా స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు. ఉద్యోగరీత్యా మా అమ్మానాన్న గుత్తా చలపతిరావు, వాసవి నల్లగొండలో స్థిరపడ్డారు. నేను పదో తరగతి వరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుకున్నాను. హైదరాబాద్‌లో ఇంటర్‌, బీఏ జర్నలిజం పూర్తి చేశాను. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడిలో పీజీ చేశాను. మా అమ్మకు నాట్యం అంటే ఇష్టం. తను నేర్చుకోవాలకుంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు. నేను చిన్ననాటి నుంచి డాన్స్‌ బాగా వేసే దాన్ని. అమ్మ గుర్తించి కూచిపూడి నేర్పించింది. పాలబిందెల బాలు మాస్టారు వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. అనేక సందర్భాల్లో స్టేజీ ప్రోగ్రాముల్లో కూచిపూడి నాట్యం చేశాను. అప్పుడు వచ్చిన ప్రశంసలు నాకు ప్రేరణ కలిగించాయి. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నాను. కానీ డాన్స్‌ పైనా ఎక్కువ శ్రద్ద పెట్టాను. పేరిణి లాస్యంలో కూడా శిక్షణ తీసుకున్నాను. ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి మంజుభార్గవి వద్ద కూచిపూడి వర్క్‌షాపుకు హాజరయ్యాను. నల్లగొండకు చెందిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌ వద్ద రీ రికార్డింగ్‌లో పనిచేశాను. ఆ తర్వాత జానదప పాటల్లో నటించే అవకాశం లభించింది.

2021లో మొదటి అవకాశం

2021లో సై టీవీ రూపొందించిన ‘తిన్నాతీరం పడతలే’ అనే పాటలో మొదటిసారి నటించాను. ఆ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు సంవత్సరాల్లో 300 వరకు జానపద పాటల్లో నటించాను. చాలా అవకాశాలు వస్తున్నా.. అందులో మంచివి మాత్రమే ఎంచుకుంటాను. ఫోక్‌ పాటలకు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్‌ లభించింది. యూట్యూబ్‌లో 100 మిలియన్‌ బేంచ్‌ మార్క్‌కు చేరింది. శాసీ్త్రయ నాట్యం నుంచి జానపదానికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా జానపద పాటల్లో ప్రారంభమైన నటన నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కలివి వనం’ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కూచిపూడిలో పీహెచ్‌డీ చేస్తా..

చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నా. అనేక వర్క్‌షాపులకు హాజరయ్యా. డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్స్‌ డిగ్రీ చదివాను. అయినప్పటికీ కూచిపూడిలో పరిశోధన చేసి పీహెచ్‌డీ చేయాలనేది నా లక్ష్యం. అంతే కాదు నేను నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలని భావించాను. నల్లగొండలో మాకు సొంత ఇల్లు ఉంది. అవకాశాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాం. నేను నేర్చుకున్న కళ పది మందికి నేర్పించాలనేది నా కోరిక. నల్లగొండలో నాగదుర్గ నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రం నడిపిస్తున్నా. 60 మంది వరకు విద్యార్థులు శిక్షణకు వస్తున్నారు. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి శని, ఆదివారం నల్లగొండకు వస్తాం.

 My goal is to do  PhD1
1/3

పీహెచ్‌డీ చేయాలనేది నా లక్ష్యం

Currently acting in the movie 'Kalivi Vanam'2
2/3

ప్రస్తుతం ‘కలివి వనం’ సినిమాలో నటించాను

Nalgonda Nagadurga excels in folk Songs3
3/3

జానపదంలో రాణిస్తున్న నల్లగొండ నాగదుర్గ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement