
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి సెలబ్రిటీలు వర్సెస్ కామన్‌మ్యాన్ అన్నట్లుగా పోటీ ఉండనుంది. ఇప్పటికే లాంచింగ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా 14 మంది హౌస్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో ఇన్‌ఫ్లుయెన్సర్ రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్) కూడా ఉండనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ లిస్టులో మాత్రం ఆమె పేరు లేదు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా..
అయితే ఆమె వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న బిగ్‌బాస్ 9 గ్రాండ్ లాంచ్ 2.0 కింద ఐదారుగురిని హౌస్‌లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నారు. వీరిలో రమ్య పేరు కూడా ఉంది. ఇకపోతే రమ్య మోక్ష, తన సిస్టర్స్ అలేఖ్య, సుమ కంచర్లతో కలిసి ఇటీవల థియేటర్‌కు వెళ్లగా అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని సుమ యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది. పచ్చళ్లతో బాగా సంపాదించుకుంటున్నారు. మా డబ్బుతోనే తింటున్నారు, మా డబ్బుతోనే బతుకుతున్నారు అని ప్రతి వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.
ఏం తప్పు చేశాం?
మేమేం చేస్తున్నామని? మాకు వచ్చిన విద్య పచ్చళ్ల చేయడం.. వాట్సాప్ నెంబర్ పెట్టి ఆర్డర్ చేయమంటున్నాం. మా క్వాలిటీ మాకు తెలసు కాబట్టి ఒక రేటు ఫిక్స్ చేస్తున్నాం, అది మా ఇష్టం! నచ్చినవాళ్లు కొంటున్నారు, నచ్చనివాళ్లు లైట్ తీసుకుంటున్నారు. అంతకుమించి మేం ఏం తప్పు చేశాం? వాట్సప్‌లో చెండాలమైన వీడియోలు పంపుతాం.. దానికి డబ్బు పంపండి అని అడిగామా? చిట్ ఫండ్స్ పెట్టి ఎత్తేశామా? మేము సమస్యల్లో ఉన్నామని డబ్బులు అడుక్కుంటున్నామా? అవేమీ చేయడం లేదుగా!

ఒక్కరు స్పందించరే?
అందులో మీకు తప్పేం కనిపించింది? అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదమైనప్పుడు మా మీద ఎన్నెన్ని వీడియోలు చేశారు? ఇప్పుడు మా గురించి తప్పుడు కామెంట్స్ పెడుతుంటే ఒక్కరు స్పందించరేంటి? మేము బయట కనిపిస్తే అలా చేయండి, ఇలా చేయండి అని జనాల్ని రెచ్చగొడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ రోజు నా భర్త బర్త్‌డే కాబట్టి చెల్లివాళ్లందరితో కలిసి సినిమాకు వెళ్లాను. అక్కడ కొందరు మమ్మల్ని గుర్తుపట్టి సెల్ఫీలు దిగారు.
అసభ్య కామెంట్స్
తర్వాత క్యాంటీన్‌లో కూల్‌డ్రింక్స్ కొనుక్కుని సినిమా హాల్‌లోకి వెళ్తున్నాం. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అంకుల్స్ మమ్మల్ని చూస్తూ చెండాలంగా సైగలు చేస్తున్నారు. చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అనవసరంగా మూడ్ నాశనం చేసుకోకూడని ముందుకు వెళ్లిపోయాం. థియేటర్‌లో కూడా మా వెనకాలే కూర్చుని... మొగుడు పక్కనుంటే మాట్లాడకూడదా? అంటూ ఏదేదో పిచ్చిగా వాగారు. ఆ కామెంట్స్ భరించలేక వెళ్లిపోతుంటే సినిమా చూడాలంటే సామాన్లు బాగుండాలంటీ అన్నారు. అమ్మాయిలంటే సామాన్లా? మా శరీరం గురించి చెత్తగా వాగుతుంటే ఎవరూ పట్టించుకోరా?
దిశ యాప్ వల్లే..
అలేఖ్య తెలివిగా వెంటనే దిశ యాప్‌లో కంప్లైంట్ పెట్టింది. పోలీసులు వెంటనే మేమున్న ప్రదేశానికి వచ్చి ఆ ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. అప్పటివరకు మాగురించి చెడుగా కామెంట్ చేసుకుంటూ నవ్వినవాళ్లు పోలీసులను చూడగానే మా కాళ్లు పట్టుకునేందుకు కూడా వెనుకాడలేదు. ఇలాంటివారిని వదిలపెట్టకూడదు. అందుకే పోలీసులను కేసు నమోదు చేయమన్నాం అని సుమ ఆగ్రహించింది.