
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ
ఆలేరు: ఆలేరు మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు చింతకింది మురళీపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీఆర్‌ఎస్ ఆలేరు పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్‌గౌడ్ శనివారం విలేకరులకు వెల్లడించారు. త్రిఫ్ట్ పథకంలో బీనామీ పేర్లతో రూ.70లక్షల గోల్‌మాల్ అయ్యాయని, ఆలేరులోని సిల్క్‌నగర్ సొసైటీలోనూ నిధులు పక్కదారి పట్టాయని, ఈ వ్యవహారాల్లో మురళి ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో అధిష్టానం ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్టు స్పష్టం చేశారు. ఈ విషయమై చేనేత కార్మికులు గతంలోనే కలెక్టర్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తనపై చర్యలనుంచి తప్పించుకోవడానికే మురళి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో నాయకులు మొరిగాడి వెంకటేష్, ఆడెపు బాలస్వామి,పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, జల్లి నర్సింహులు,జూకంటి ఉప్పలయ్య పాల్గొన్నారు.
మురళీపై చర్య తీసుకోవాలి: చేనేత కార్మికులు
నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరిపి మురళీపై చర్యలు తీసుకోవాలని, నిధులు రికవరీ చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే ఐలయ్యకు పద్మశాలి సంఘం నాయకులు పాశికంటి శ్రీనివాస్, భేతిరాములు, బింగి రవి, చేనేత కార్మికులు గట్టు రాజు, మార్కేండేయ, మెరుగు కృష్ణలు విజ్ఞప్తి చేశారు. ఆలేరులో నిర్వహించనున్న సమావేశానికి, పద్మశాలి సంఘానికి, కులానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఆరోపణలు అవాస్తవం : చింతకింది మురళి
బీఆర్‌ఎస్ నాయకుల ఆరోపణలను మురళి ఖండించారు. కాంగ్రెస్‌లో తన చేరికను అడ్డుకునే కుట్రలో భాగమన్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే ఐలయ్య ఆహ్వానం మేరకు ఈనెల 9న కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు.త్రిఫ్ట్‌లో నిధుల గోల్‌మాల్ తప్పుడు ప్రచారమేనని పేర్కొన్నారు.
ఫ ఆలేరు మాజీ సర్పంచ్ మురళీపై ఆరేళ్లు వేటు