
వినాయకుడి పూజకు వెళ్లొచ్చేలోగా ఇంట్లో చోరీ
ఆత్మకూరు(ఎం): వినాయకుడి వద్దకు పూజకు వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన గుండెగాని మల్లయ్య ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి వినాయకుడి వద్ద పూజలు చేయడానికి వెళ్లారు. పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఇంటికి వచ్చే సరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో బీరువా పరిశీలించి చూడగా.. అందులోని రూ. 50వేల నగదు కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం సాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు.