
కనుల పండువగా గజవాహన సేవ
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్యారాధనల్లో భాగంగా గజవాహన సేవ కనుల పండువగా నిర్వహించారు. శనివారం వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య నిత్యకల్యాణం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఆ తరువాత బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు తదితర కైంకర్యాలు గావించారు. సాయంత్రం వెండిజోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. వేద ఆశీర్వచనం, నిత్యకల్యా ణం తదితర పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.