చెక్కు బౌన్స్‌ కేసులో మూడు నెలల జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

చెక్కు బౌన్స్‌ కేసులో మూడు నెలల జైలుశిక్ష

Jul 16 2025 3:17 AM | Updated on Jul 16 2025 4:17 AM

తుంగతుర్తి: చెక్కు బౌన్స్‌ కేసులో నిందితుడికి మూడు నెలలు జైలుశిక్షతో పాటు నష్టపరిహారం కింద బాధితుడికి రూ.4లక్షలు అందించాలని తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఎండీ గౌస్‌ పాషా మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన మందడి సోమేశ్వర్‌రెడ్డి వద్ద 2017 జనవరి 15న నల్లగొండ మండలం దండంపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన వీరయ్య రూ.3లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న సమయంలో వీరయ్య సోమేశ్వర్‌రెడ్డికి చెక్కు ఇచ్చాడు. కొంతకాలం తర్వాత వీరయ్య అప్పు తిరిగి చెల్లించకపోవడంతో అతడు ఇచ్చిన చెక్కును సోమేశ్వర్‌రెడ్డి బ్యాంకులో వేయగా అకౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో 2017 ఆగస్టు 1వ తేదీన సోమేశ్వర్‌రెడ్డి తుంగతుర్తి కోర్టులో చెక్కు బౌన్స్‌ కేసు వేశాడు. ఈ కేసు తుది విచారణలో వాదోపవాదాలు విన్న తర్వాత వీరయ్యకు మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.4లక్షలు సోమేశ్వర్‌రెడ్డికి చెల్లించాలని జడ్జి ఎండీ గౌస్‌ పాషా తీర్పు వెలువరించారు.

అప్పుల బాధతో

యువకుడి ఆత్మహత్య

యాదగిరిగుట్ట రూరల్‌: అప్పుల బాధతో యువకుడు ఉరేసుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన పల్లెపాటి శివ(25) యాదగిరిగుట్ట ఆలయం కొండ పైన కాంట్రాక్ట్‌ పద్ధతిలో గార్డెన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శివ గత కొన్నిరోజులుగా అప్పుల బాధతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

అడ్డగూడూరు: రోడ్డు దాటుతున్న మహిళను బైక్‌ ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండలం చిన్నపడిశాల గ్రామానికి చెందిన బండారు పుష్ప మంగళవారం హైదరాబాద్‌లో ఉంటున్న తన బంధువుల వద్దకు వెళ్లేందుకు గాను బస్సు కోసం చౌల్లరామారం గ్రామ స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా.. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెద్ది వీరేష్‌ బైక్‌పై హైదరాబాద్‌ నుంచి తన స్వగ్రామనికి వెళ్తూ పుష్పను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పుష్ప కాలు విరిగింది. వీరేష్‌ తల, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

లారీ దగ్ధం

వలిగొండ: షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకొని లారీ దగ్ధమైంది. ఈ ఘటన వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌ రహీసూల్‌ ప్లాస్టిక్‌ తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో చైన్నెకి వెళ్తుండగా.. సోమవారం అర్ధరాత్రి వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామ సమీపంలోకి రాగానే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా లారీకి మంటలంటుకున్నాయి. మంటలు లారీ మొత్తం వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపారు.

చెక్కు బౌన్స్‌ కేసులో మూడు నెలల జైలుశిక్ష1
1/1

చెక్కు బౌన్స్‌ కేసులో మూడు నెలల జైలుశిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement