
డిగ్రీతో ‘దోస్త్’ కుదరడం లేదు!
భువనగిరి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కళాశాల్లో ఫస్టియర్‌లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ మే నెల 3వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. అదే నెల 10వ తేదీ నుంచి విద్యార్థులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మూడు విడుతల్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు జూన్ 25వ తేదీన మూడో విడత సీట్ల కేటాయింపుతో ఈ ప్రక్రియ ముగిసింది. ఈ మూడు విడుతలు ముగిసే నాటికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో కనీసం 25శాతం కూడా సీట్లు భర్తీకాలేదు.
ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రభుత్వ కళాశాలలు..
మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు ప్రభుత్వ, నాలుగు అటానమస్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటితో పాటు ఎయిడెడ్, బీసీ సంక్షేమ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మాత్రం 15 నుంచి 25 శాతం వరకు మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఇటీవల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయ్యింది. ఇంజనీరింగ్‌లో సీట్లు రాని వారు డిగ్రీలో చేరేందుకు వీలుగా నాలుగో విడత దోస్త్ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు.
వృత్తి విద్యా కోర్సుల వైపు మొగ్గు..
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎక్కువగా వృత్తి విద్యా కోర్సుల వైపు మొగ్గుచూపుతున్నారు. కొంత మంది బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల్లో వసతి సౌకర్యాలు ఉండటంతో వాటిలో ప్రవేశాల పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కొత్త కోర్సులకు అనుమతి తీసుకోవడంతో ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు చేరుతున్నారు. జీవితంలో తొందరగా స్థిరపడాలనే ఆలోచనతో ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, బీ ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందాలని చూస్తున్నారు.
అన్నీ ఉన్నా విద్యార్థులు లేక..
విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రస్తుతం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కొత్త కోర్సులను అనుమతి తీసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కొత్త కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు కొంత మెరుగ్గానే ఉన్నాయి. దీనికి తోడు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విస్తృత్తంగా ప్రచారం చేసి ప్రవేశాల సంఖ్యను పెంచుకుంటున్నాయి. కానీ విశాలమైన భవనాలు, సకల సౌకర్యాలు, అధ్యాపకులు ఉన్నప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఇటీవల నల్లగొండలోని మహత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ
కళాశాలల్లో భర్తీ అయిన సీట్ల వివరాలు
ఇప్పటివరకు
భర్తీ అయిన సీట్లు
మొత్తం
సీట్లు
ప్రభుత్వ
కళాశాల
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో
25శాతం కూడా భర్తీ కాని సీట్లు
మూడు విడుతలు కౌన్సిలింగ్ నిర్వహించినా అంతంతమాత్రంగానే ఆదరణ
ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్న విద్యార్థులు
ఆలేరు 360 58
చండూరు 180 37
హాలియా 480 64
హుజూర్‌నగర్ 360 65
నకిరేకల్ 300 44
రామన్నపేట 360 85
మిర్యాలగూడ 420 88