గంజాయి ముఠా గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా గుట్టు రట్టు

Jul 19 2025 3:17 AM | Updated on Jul 19 2025 3:17 AM

గంజాయి ముఠా గుట్టు రట్టు

గంజాయి ముఠా గుట్టు రట్టు

నకిరేకల్‌: అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నకిరేకల్‌ పోలీసులు. ఈ ముఠాలో పది మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రంలోని కలహండి జిల్లా కోకసర్‌ తాలుకా దుంపార గ్రామానికి చెందిన కిశోర్‌ టాండన్‌ కొంతకాలంగా నకిరేకల్‌లో నివాసముంటూ విజయవాడ–హైదరాబాద్‌ హైవే వెంట ఉన్న నారాయణస్వామి డెయిరీ ఫామ్‌ యాజమాని వద్ద కార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కిశోర్‌ టాండన్‌ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఒరిస్సాలోని తన సొంత గ్రామానికి చెందిన బోలానాథ్‌ దగ్గర తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నకిరేకల్‌కు తీసుకొచ్చి.. నకిరేకల్‌ పట్టణంలోని రైస్‌ మిల్లుల్లో పనిచేస్తున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన అర్జున్‌ కుమార్‌దాస్‌, మిల్కా కుమార్‌, షేక్‌ అబ్బు, బికాస్‌, వికాస్‌ను పరిచయం చేసుకుని వారికి ఒక్కొక్కరికి 500 గ్రాముల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన వారు నకిరేకల్‌లోని చీమలగడ్డకు చెందిన విద్యార్థి యమడాల క్రాంతికుమార్‌, రహమత్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ లక్కపాక సంతోష్‌, లిఫ్ట్‌ ఆపరేటర్‌ యాదుళ్ల అఖిల్‌రెడ్డి, ఫొటోగ్రాఫర్‌ షేక్‌ సియామ్‌, నకిరేకల్‌ మండల కడపర్తి గ్రామానికి చెందిన ఎక్స్‌రే టెక్నీషియన్‌ గుండె శ్రీకాంత్‌, బిహర్‌ రాష్ట్రంలోని పాట్నా జిల్లా దూదాల తాలుకాలోని హల్దీచాప్రా గ్రామానికి చెందిన నాగేందర్‌కుమార్‌తో పాటు మరికొందరికి 50 గ్రాముల చొప్పున విక్రయించారు. గురువారం సాయంత్రం నకిరేకల్‌ పట్టణ శివారులోని సాయిప్రియ హోటల్‌ వెనుక గడ్డివాముల పక్కన ఉన్న ఓ ఇంట్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి కిశోర్‌ టాండన్‌ను పట్టుకున్నారు. అతడిని విచారించగా.. మిగతా వారి పేర్లు చెప్పడంతో బిహార్‌ రాష్ట్రానికి చెందిన అర్జున్‌కుమార్‌, మిల్కా కుమార్‌, షేక్‌ అబ్బు, నాగేందర్‌కుమార్‌తో పాటు నకిరేకల్‌కు చెందిన యమడాల క్రాంతికుమార్‌, లక్కపాక సంతోష్‌, యాదుళ్ల అఖిల్‌రెడ్డి, షేక్‌ సియామ్‌, కడపర్తి గ్రామానికి చెందిన గుండె శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బోలానాథ్‌, బిహార్‌ రాష్టానికి చెందిన బికాస్‌, వికాస్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారి నుంచి మూడు కేజీల గంజాయి, 10 సెల్‌ఫోన్లు, రూ.9500 నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నకిరేకల్‌ సీఐ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ లచ్చిరెడ్డి, పోలీస్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అభినందించారు.

10 మంది అరెస్ట్‌.. ముగ్గురు పరారీ

3 కేజీల గంజాయి, 10 సెల్‌ఫోన్లు, రూ.9500 నగదు స్వాధీనం

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్‌

రిమాండ్‌కు తరలింపు

తిరుమలగిరి(నాగార్జునసాగర్‌): ఒరిస్సా నుంచి అక్రమంగా గంజాయి తీసుకువచ్చి తిరుమలగిరి(సాగర్‌)మండల పరిధిలో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ వీరశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చండూరు మండలం కోటయ్యగూడేనికి చెందిన శివరాత్రి దుర్గాప్రసాద్‌, రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌కు చెందిన వరికుప్పల దిలీప్‌కుమార్‌, వరికుప్పల ప్రశాంత్‌ ఒరిస్సా రాష్ట్రంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు ముగ్గురు కొంతకాలంగా ఒరిస్సా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయిని రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడి యువతకు విక్రయిస్తున్నారు. గురువారం తిరుమలగిరి(సాగర్‌) మండలం చిల్కాపురం గ్రామానికి చెందిన తుడుం ధనుంజయ్‌ అనే వ్యక్తికి గంజాయి విక్రయిస్తుండగా.. నమ్మదగిన సమాచారం మేరకు తిరుమలగిరి గ్రామ శివారులో వీరి ముగ్గురిని పట్టుకున్నారు. ధనుంజయ్‌ పరారయ్యాడు. వారి నుంచి 96 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఒక బాంగ్‌ బాటిల్‌ స్వాధీనం చేసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. తిరుమలగిరి(సాగర్‌) మండలంలో గంజాయి సేవించే పది మంది వ్యక్తులను గుర్తించామని, వారిని రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపించనున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి అమ్మినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement