
బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం స్పష్టతనివ్వాలి
నల్లగొండటౌన్: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టతనివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో చర్చలు జరిపారని, కొన్ని నిర్ణయాలు కూడా జరిగాయని ఏపీ ఇరిగేషన్ మంత్రి ప్రకటించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు చర్చలు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలు జరిగిఉంటే రాష్ట్రానికి వరద, మిగులు జలాలపై స్పష్టమైన వాటాలను తేల్చాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తోందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన విధంగా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. జగిత్యాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న మల్లేష్ అనే యువకున్ని యువతి బంధువులు హత్య చేయడం దారుణమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే కులాంతర వివాహ చట్టం తేవాలన్నారు. ప్రజా సమస్యలపై ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఉద్యమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై
ఆగస్టు నుంచి పోరుబాట
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ