
‘సుంకిశాల’ పూర్తయ్యేదెన్నడో..!
పెద్దవూర: పెద్దవూర మండలం పాల్తీతండా సమీపంలోని సుంకిశాల గుట్టపై నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్(సుంకిశాల పథకం) పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 455 అడుగుల లోతు(డెడ్‌స్టోరేజీ)లో ఉన్నా హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరందించేందుకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్‌లై అండ్ సీవరేజ్ బోర్డ్) ఆధ్వర్యంలో రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల గడువు పొడిగించినా పూర్తికావడం లేదు. గత ఏడాదే ఒక సొరంగం పూర్తిచేసి జంటనగరాలకు తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సొరంగంలోకి నీరు రాకుండా కాంక్రీట్ పిల్లర్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్ గతేడాది ఆగస్టు 2న కూలి పంప్‌హౌస్ నీట మునిగింది. ఇప్పటికీ గేట్లు అమర్చేందుకు నిర్మించాల్సిన కాంక్రీటు పిల్లర్లతో కూడిన నిర్మాణ పనులు ప్రారంభించలేదు.
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో గతంలో కృష్ణా బ్యాక్ వాటర్ సొరంగంలోకి నీరు వెళ్లిన ప్రాంతాన్ని పూర్తిగా బంకమట్టి, కంకర, కాంక్రీట్‌తో నింపి పూడ్చివేశారు. జలాశయం పూర్తిగా నిండినా పంప్‌హౌస్‌లో పనులకు ఎలాంటి అవరోధం లేకుండా చర్యలు తీసుకున్నారు. పంప్‌హౌస్‌లో 40అడుగుల లోతులో చేరిన నీటిని ఏడు భారీ మోటార్లతో పూర్తిగా తొలగించారు. గతంలో కూలిపోయిన రిటైనింగ్ వాల్ శిథిలాలను భారీ కట్టర్ మిషన్లతో తొలగించే పనులు జరుగుతున్నాయి. మరో వారంలో ఈ పనులు పూర్తికానున్నాయి. ఇప్పటికే 70 శాతం పూర్తయిన రిటైనింగ్ కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. సుంకిశాల నుంచి కోదండపురం వరకు 17 కి.మీ. దూరం, 40 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల్లో నిర్మిస్తున్న పైపులైన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మోటార్లు బిగించే కాంక్రీట్ పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.
ప్రాజెక్టు ఉద్దేశం ఇదీ..
హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణా తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో సుంకిశాల పథకానికి శంకుస్థాపన చేశారు. రైతుల ఆందోళనతో ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక ఆ పనులను పక్కన పెట్టి ఏఎమ్మార్పీ ద్వారా పుట్టంగండి సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్‌కు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జంటనగరాలకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూ.1,450 కోట్ల అంచనాతో సుంకిశాల పథకాన్ని చేపట్టింది. నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని 2035 నాటికి 47.71 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065 నాటికి 67.71 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందన్న అంచనాతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. దీంట్లో భాగంగా రూ.317.56 కోట్లు పంప్‌హౌస్ నిర్మాణానికి, రూ.215.77 కోట్లు ఎలక్ట్రో మెకానికల్ పనులకు, రూ.636.5 కోట్లు (సుంకిశాల నుంచి కోదండపురం వరకు 17 కి.మీ. దూరం 40 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల్లో) పైపులైన్ నిర్మాణానికి కేటాయించారు. సొరంగాన్ని మూడు స్టేజీల్లో.. సముద్ర మట్టానికి జలాశయంలో 450 అడుగుల లోతులో ఒకటి, 504 అడుగుల లోతులో రెండోది, 547 అడుగుల లోతులో మూడోది నిర్మిస్తున్నారు. జలాశయం ఉపరితలంపై నీటిని సొరంగం ద్వారా పంప్‌హౌస్‌లోకి తరలిస్తారు. మూడు పైపులైన్లను ఒక్కోటి 2.347 మీటర్ల వ్యాసంతో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోపైపు ద్వారా 90ఎంజీవీ(మిలియన్ గ్యాలన్లు), 410 మిలియన్ లీటర్ల నీరు వెళ్లనుంది. మొత్తం 18 మోటార్లను అమర్చి నిత్యం 12 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. సంవత్సరానికి 16.5 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి జంటనగరాలకు నీటిని తరలించేలా డిజైన్ చేశారు. ఈ పనులకు 2022 మే 14న నాటి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు శంకుస్థాపన చేశారు.
ఫ పంప్‌హౌస్ పనులు ప్రారంభమై నాలుగు సంవత్సరాలు
ఫ పూర్తిచేయాల్సింది
2022 డిసెంబర్ నాటికే..
ఫ మళ్లీ 2023 మార్చి వరకు
గడువు పొడిగింపు
ఫ కూలిన కాంక్రీట్ పిల్లర్ల శిథిలాల
తొలగింపు పనులు ప్రారంభం
ఫ పథకం పూర్తికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం
సొరంగం పనులకు బ్రేక్
గతేడాది ఆగస్టు 2న సుంకిశాల పంప్‌హౌస్ నీట మునగడంతో సొరంగం పనులకు బ్రేక్ పడింది. వాస్తవానికి ఈ పనులను 2022 డిసెంబర్ నాటికి పూర్తిచేయాల్సి ఉన్నా.. 2023 మార్చి వరకు పొడిగించారు. అయినా పంప్‌హౌస్ నీట మునిగే సమయానికి 70 శాతం పనులే పూర్తయ్యాయి. 450 అడుగుల లోతులో నిర్మిస్తున్న మొదటి సొరంగం 650 మీటర్ల పొడవుకు గాను 610 మీటర్లు పూర్తికాగా, ఇంకా 40 మీటర్ల మేర కావాల్సి ఉంది. రెండో దశ సొరంగం పూర్తికాగా, మూడోది 20 మీటర్ల మేర పనులు కావాల్సి ఉంది. పనులు పూర్తికాకముందే సొరంగం నుంచి వచ్చిన నీటి తాకిడికే కాంక్రీటు పిల్లర్లతో కూడిన నిర్మాణం కూలిపోవడంపై పనుల్లో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘సుంకిశాల’ పూర్తయ్యేదెన్నడో..!

‘సుంకిశాల’ పూర్తయ్యేదెన్నడో..!