
అరచేతిలో వాతావరణ సూచనలు
త్రిపురారం: రైతులకు ఎప్పటికప్పడు వాతావరణ సమాచారంతో పాటు పిడుగుల హెచ్చరికల కోసం భారత వాతావరణ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా మేఘ్ దూత్, దామిని యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మేఘ్ దూత్ యాప్ ద్వారా రాబోయే ఐదు రోజుల వాతావరణ సమాచారంతో పాటు వారం క్రితం సమాచారం కూడా రైతులు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పంటలకు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రధాన పంటల్లో వచ్చే చీడపీడలు, వాటి నివారణ చర్యలను తెలుసుకోవచ్చు. మేఘ్ దూత్ యాప్ ద్వారా ప్రతి మంగళవారం, శుక్రవారం ఆగ్రో– మెట్ ఫీల్డ్ యూనిట్లు, జిల్లా ఆగ్రో– మెట్ ఫీల్డ్ యూనిట్లు పరస్పరంగా వివిధ పంటల సమాచారాన్ని రైతులకు ఎస్‌ఎంఎస్ ద్వారా అందిస్తుంది. అదేవిధంగా ఏటా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడి మూగ జీవాలు, రైతులు, పశువుల కాపరులు ప్రాణాలు కోల్పోతున్నారు. పిడుగులను ముందుగానే పసిగట్టడానికి దామని యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ 500 మీటర్ల కంటే తక్కువ వ్యాసార్థంలో పిడుగులు పడే పరిధిని గుర్తించి సమాచారం అందిస్తుంది. దీంతో రైతులు ముందుగానే సురక్షిత ప్రాంతాలలకు చేరుకోవచ్చు.
యాప్‌ల డౌన్‌లోడ్ ఇలా..
ఫోన్‌లోని ప్లేస్టోర్‌లోకి వెళ్లి మేఘ్ దూత్(ఇంగ్లిష్‌లో) అని టైప్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత సైన్‌అప్‌పై క్లిక్ చేసి పేరు, ప్రాంతం, ఫోన్ నంబర్, భాష, రాష్ట్రం, జిల్లా నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తిరిగి లాగిన్‌పై క్లిక్ చేసి ఫోన్ నంబర్ నమోదు చేసి లాగిన్ కావాలి. యాప్ ఓపెన్ చేసిన తరువాత స్క్రీన్‌పై వాతావరణం వివరాలు చూపిస్తుంది.అదేవిధంగా ప్లేస్టోర్ నుంచే దామిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి మొబైల్ నంబర్, అడ్రస్, పిన్‌కోడ్ నమోదు చేయాలి. అనంతరం జీపీఎస్ లోకేషన్‌కు అనుమతి ఇస్తే యాప్ పనిచేయడం ప్రారంభమవుతుంది.
పిడుగులను గుర్తించే మార్గాలు
మీరు ఉన్న ప్రదేశంలో 7 నిమిషాల వ్యవధిలో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే పసుపు రంగులోకి.. 18 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ నీలం రంగులోకి మారుతుంది.
ఫ రైతుల కోసం మేఘ్ దూత్
మొబైల్ యాప్..
ఫ పిడుగులను గుర్తించేందుకు
దామిని యాప్‌ను తీసుకొచ్చిన
భారత వాతావరణ శాఖ

అరచేతిలో వాతావరణ సూచనలు