
అభినవ గాంధీ ‘దొడ్డా’ కన్నుమూత
ప్రభుత్వం నుంచి
రూ.50 వేలు ఆర్థికసాయం
దొడ్డా నారాయణరావు అంత్యక్రియలకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.50వేలను శనివారం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ దొడ్డా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, చిలుకూరు తహసీల్దార్ ధృవకుమార్, ఎస్‌ఐ సురభి రాంబాబు, ఆర్‌ఐ మంత్రిప్రగడ సీతరామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు: సీపీఐ సీనియర్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అభినవ గాంధీగా పేరుగాంచిన దొడ్డా నారాయణరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి చిలుకూరులోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. నాటి నిజాం నిరంకుంశ పాలనకు, బేతవోలు ప్రాంతంలోని జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన అనేక పోరాటాలు నిర్వహించి పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. అంతేకాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని సారా ఉద్యమం వరకు తన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు.
అన్న స్ఫూర్తితో ఉద్యమంలోకి..
చిలుకూరు గ్రామానికి చెందిన దొడ్డా అప్పయ్య, వెంకమ్మ దంపతులకు ఏడుగురు మగ సంతానం. వారిలో ఆరోవాడు దొడ్డా నారాయణరావు. హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య తమ్ముడే దొడ్డా నారాయణరావు. 1941లో చిలుకూరు రావినారాయరెడ్డి కాలనీలో 8వ ఆంధ్ర మహాసభ నిర్వహించడంలో నారాయణరావు అన్న దొడ్డా నర్సయ్య కీలకపాత్ర పోషించారు. ఆనాడు వడ్డీ వ్యాపారులు దొంగ లెక్కలు, పటేల్ పట్వారీ వ్యవస్థ, అక్రమ శిస్తు వసూలు తదితర దోపిడీలకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఆంధ్ర మహాసభ కార్యకర్తలకు దొడ్డా నర్సయ్య నాయకత్వం వహించారు. ఇవన్నీ దొడ్డా నారాయణరావును ప్రభావితం చేశాయి. 1947 కంటే ముందు రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కొన్ని సందర్భాల్లో దొడ్డా నర్సయ్య, వేనేపల్లి అంజయ్య లాంటి వ్యక్తులు అజ్ఞాతంలో వెళ్లారు. ఆ సమయంలో దొడ్డా నారాయణరావు స్థానికంగా ఉంటూ వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండేవాడు. 1948 ప్రారంభంలో చిలుకూరులో ఐదుగురు సభ్యులతో కమ్యూనిస్టు పార్టీ సెల్ ఏర్పాటు చేసి నారాయణరావును కార్యదర్శిగా నియమించారు. స్వాతంత్య్రం అనంతరం పార్టీపై నిర్భందం పెరిగింది. దీనికి తోడు రహస్య జీవితం గడుపుతున్న కొంతమంది దళ సభ్యులకు తను సమాచారం అందిస్తున్నట్లుగా రజాకార్లకు తెలిసి అనుమానం వచ్చి నారాయణరావును ప్రశ్నించారు. బేతవోలు మక్తేదారికి వ్యతిరేకంగా నిర్వహించిన పలు ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు.
నాలుగు దశాబ్ధాల పాటు ప్రజాప్రతినిధిగా..
చిలుకూరుకు 25 సంవత్సరాలు సర్పంచ్‌గా, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు చిలుకూరు మండలానికి ఎంపీపీగా, చిలుకూరు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా 5ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన చొరవతోనే చిలుకూరులో గ్రంథాలయం ఏర్పాటైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా వరుసగా రెండు పర్యాయాలు 6ఏళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, పార్టీ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
భార్య మృతితో కుంగిపోయి..
దొడ్డా నారాయణరావు భార్య సక్కుబాయమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి ఆయన మానసికంగా కుంగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురై మృతిచెందారు. నారాయణరావుకు ముగ్గురు కుమారులు సంతానం. వారిలో పెద్ద కుమారులు ఇద్దరు రమేష్, సురేష్ తండ్రి బాటలోనే రాజకీయాల్లో కొనసాగుతుండగా.. చిన్న కుమారుడు శ్రీధర్ మాత్రం లాయర్‌గా పనిచేస్తున్నాడు.
ఫ అనారోగ్యంతో మృతిచెందిన
దొడ్డా నారాయణరావు
ఫ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో
కీలక పాత్ర
ఫ 40ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా, సీపీఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు
16 నెలలు జైలు జీవితం
స్వాత్రంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన దొడ్డా నారాయణరావు స్వగ్రామంలోని సమస్యలపై కూడా ఉద్యమాలు చేశారు. అనంతరం 1959లో చిలుకూరు గ్రామ ప్రథమ సర్పంచ్‌గా దొడ్డా నారాయణరావు ఎన్నికయ్యారు. భారత్, చైనా యుద్ధం సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలులో ఉంచి 16 నెలల అనంతరం విడుదల చేశారు.

అభినవ గాంధీ ‘దొడ్డా’ కన్నుమూత