కర్రలు పట్టకండీ.. ఫోన్ కొట్టండి
● వీటి శాసీ్త్రయ నామం పైథాన్ మోలురస్. ఇవి గరిష్టంగా 12 అడుగుల పొడవు, 52 కిలోల బరువు వరకు పెరుగుతాయి. వీటి జీవిత కాలం సుమారు 21 ఏళ్లు.
●ఏడాది వయసు దాటాక మార్చి, ఏప్రిల్ నెలల్లో జతకడతాయి. 2 నుంచి 3 నెలల్లో గర్భం దాల్చి, నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20–30 చొప్పున సుమారు 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు పొదిగితే వాటిలో 80 శాతానికి పైగా పిల్లలు బయటకు వస్తాయి.
● పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల పొడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లలను తల్లే తినేస్తుంది! ఆహారం అందక మరికొన్ని చనిపోగా, చివరకు 10 నుంచి 15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది.
● చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయలు, పాడుబడిన బొరియలు, మడ అడవుల్లో ఇవి దాక్కుంటాయి. ఎలుకలు, కోళ్లు, పక్షులు, అడపాదడపా చిన్న జంతువులను ఆహారంగా తీసుకుని పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయి.
కై కలూరు: భారీ కాయంతో కనిపిస్తున్నాయనే భయం.. విషపూరిత పాములనే అపోహ.. వెరసి కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో అరుదైన కొండచిలువలు నిర్దాక్షిణ్యంగా హతమవుతున్నాయి. ఇటీవల వరుసగా వీటిపై జరుగుతున్న దాడులు జంతు ప్రేమికులను, పర్యావరణవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మంగళవారం కలిదిండి మండలం భాస్కరరావుపేట రహదారిపై ఓ భారీ కొండచిలువను స్థానికులు కొట్టి చంపారు. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఎగువ అటవీ ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగుల ద్వారా కొల్లేరుకు వలస వచ్చిన ఈ కొండచిలువలు (ఇండియన్ రాక్ పైథాన్లు) ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి. ఉప్పుటేరు పొదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలు ఏర్పరచుకుని మనుగడ సాగిస్తున్నాయి.
సంచారం ఎక్కడెక్కడంటే..
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 9 మండలాల పరిధిలో 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. దీనికి అనుబంధంగా 2.90 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, భాస్కరరావుపేట, కై కలూరు మండలం ఆటపాక, వరహాపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో వీటి సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. నీటిలో వేగంగా ఈదగలిగే సామర్థ్యం ఉన్న ఇవి, చెరువు గట్లపై ఉండే కోళ్లు, పక్షులు, చేపలను ఆహారంగా తీసుకుంటూ సంతానోత్పత్తి చేస్తున్నాయి. అయితే, ఇవి కంటపడగానే విషసర్పాలని భయపడి జనం ప్రాణాలు తీస్తున్నారు.
అంతరిస్తున్న జాతి.. చంపితే కఠిన శిక్షలు
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఇప్పటికే వీటిని ‘హాని పొంచి ఉన్న జాతుల జాబితా’ (రెడ్ లిస్ట్)లో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిపోయిందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక్క కొల్లేరు గ్రామాల్లోనే ఏటా 30 నుంచి 40 కొండచిలువలు మనుషుల చేతిలో హతమవుతున్నట్లు అంచనా. వెలుగులోకి రాని మరణాలు ఇంకెన్నో!. భారత అటవీ శాఖ వీటిని వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్–1 జాబితాలో చేర్చింది. వీటిని చంపడం తీవ్రమైన నేరమని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లోపంతో వీటిని వధిస్తున్నారు. కొండచిలువలు కనిపిస్తే చంపకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
విషం లేని అరుదైన జాతికి పొంచి ఉన్న ముప్పు
ఆకారాన్ని చూసి అంతమొందిస్తున్న ప్రజలు
దాడులు వద్దని అవగాహన కలిగించని అటవీశాఖ
ఐయూసీఎన్ రెడ్ లిస్టులో ‘రాక్ పైథాన్’
భారీ ఆకారం చూసి అరుదైన కొండచిలువలను చంపేస్తున్నారు. వాస్తవానికి ఈ పాములు విషపూరితం కావు. టీవీలలో ఫైథాన్‌లు గోదెలు, ఇతర జంతువులను మింగేయడం వంటివి చూపి భయం కలుగుతోంది. కొల్లేరు ప్రాంతంలో ఇటువంటి ఘటనలు లేవు. కొండచిలువ కనిపించగానే కర్రలతో చంపకుండా అటవీశాఖ అధికారులకు ఫోన్‌లో సమాచారం అందించండి. సిబ్బంది వీటిని సురక్షతంగా అడవుల్లో విడిచిపెడతారు.
– డాక్టర్ పఠాన్ ముస్తాఫాఖాన్, వెటర్నరీ ఏడీ, కై కలూరు


