ఏలూరు టౌన్: మరికొన్ని నెలల్లో బీటెక్ పూర్తి చేసి, ఇంజినీర్‌గా స్థిరపడి తల్లిదండ్రుల కలలను నిజం చేయాల్సిన ఆ యువకుడి ఆశలు అర్ధాంతరంగా ఆవిరయ్యాయి. ఉదయం ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాసి, తిరిగి హాస్టల్‌కు వెళ్తున్న ఇద్దరు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులను బుధవారం మధ్యాహ్నం ఏలూరు శివారు వట్లూరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.
అసలేం జరిగింది?
విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన రాంబాబు కుమారుడు కాశిరెడ్డి తిరుమల ప్రసాద్ (21), ప్రకాశం జిల్లా (ఒంగోలు)కు చెందిన కె. శశిధర్ (20) ఏలూరులోని సర్ సీఆర్. రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ (సీఎస్‌ఈ) చదువుతున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కళాశాలలో జరిగిన ‘ఆప్టికల్ కమ్యూనికేషన్’ పరీక్షకు ఇద్దరూ హాజరయ్యారు. పరీక్ష ముగిసిన అనంతరం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తమ మోటార్ సైకిల్‌పై కళాశాల హాస్టల్‌కు బయలుదేరారు. వీరి బైక్ వట్లూరు ఐటీఐ కళాశాల దాటి, ఎలక్ట్రికల్ సబ్–స్టేషన్ సమీపానికి చేరుకోగానే, గన్నవరం వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాద తీవ్రతకు ఇద్దరూ రోడ్డుపై ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు.
ఆసుపత్రిలో విషాదం
స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా తిరుమల ప్రసాద్ పల్స్ క్రమంగా పడిపోవడంతో, మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి శశిధర్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం విజయవాడలోని అను న్యూరో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
కన్నీరుమున్నీరైన తోటి విద్యార్థులు
అప్పటివరకు తమతో కలిసి పరీక్ష రాసి, నవ్వుతూ మాట్లాడిన స్నేహితుడు ఇక లేడన్న వార్త తెలియగానే సీఆర్. రెడ్డి కళాశాల ఆవరణలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల వంటి సుదూర ప్రాంతాల నుంచి పిల్లలను చదువు కోసం పంపిన తల్లిదండ్రులకు ఈ వార్త పిడుగుపాటులా మారింది. ఘటనపై ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్తుండగా కబళించిన మృత్యువు
వట్లూరు వద్ద బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
బీటెక్ ఫైనలియర్ విద్యార్థి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం


