ఓటు వేసేది అభ్యర్థికా? అనుచరుల పెత్తనానికా?
● అనుచరుల అత్యుత్సాహంతో ఓట్లకు గండి పడే ప్రమాదం
● పలు గ్రామాల్లో అయోమయంలో పంచాయతీ అభ్యర్థులు
ద్వారకాతిరుమల : పల్లెపోరు రసవత్తరంగా మారింది. ప్రచార హోరుతో ఊరూవాడా హోరెత్తిపోతోంది. అయితే ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ కంటే, వారి వెనుక తిరుగుతున్న ‘బ్యాచ్’ తీరే గ్రామాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘అభ్యర్థి మంచోడే కానీ, ఆయన చుట్టూ ఉన్న వాళ్లే..!’ అనే మాట జిల్లాలోని చాలా మండలాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ద్వారకాతిరుమల మండలంలోని 26 పంచాయతీల్లో ఓటర్ల నోట ప్రధానంగా వినిపిస్తోంది. గెలిపించేందుకు వస్తున్నామని భావిస్తున్న కొందరు అనుచరుల అత్యుత్సాహం, చివరికి అభ్యర్థుల కొంపముంచేలా కనిపిస్తోంది.
పాత బాకీలు.. కొత్త చిక్కులు
ప్రతి గ్రామంలోనూ కొందరి పేర్లు వినగానే జనానికి పాత గొడవలు, తగాదాలు, దురుసు ప్రవర్తనలే గుర్తొస్తున్నాయి. ఆధిపత్య ధోరణితో గతంలో అందరినీ ఇబ్బంది పెట్టిన ఆ ‘ముద్ర’ వేసుకున్న వ్యక్తులే, ఇప్పుడు తమకు నచ్చిన సర్పంచ్ అభ్యర్థుల వెనుక ముందుండి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే ప్రతికూల ఇమేజ్ ఉన్న కొందరు అభ్యర్థులకు, ఇలాంటి వివాదాస్పద అనుచరులు తోడవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. అలాంటి అభ్యర్థులు గెలిస్తే, వారికి మద్దతిస్తున్న వివాదాస్పద వ్యక్తుల హవా కూడా గ్రామాల్లో పెరిగే ప్రమాదం ఉందని ఓటర్లు భావిస్తున్నారు.
పైకి నవ్వులు.. లోపల లెక్కలు
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటరు నాడి అసలు అంతుచిక్కడం లేదు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్న ప్రతి అభ్యర్థికీ ‘మా ఓటు మీకే, గెలుపు మీదే’ అంటూ ఓటర్లు తీయని మాటలతో సాగనంపుతున్నారు. అడిగితే మాత్రం ‘ఏమో.. చెప్పలేం, చూద్దాం’ అంటూ తెలివిగా తప్పించుకుంటున్నారు.
వద్దన్నా వదలని నీడలు
తమ వెనుక ఉన్న వివాదాస్పద వ్యక్తుల వల్ల ఓట్లు ఎక్కడ దూరమవుతాయోనని కొందరు అభ్యర్థులు ముందే పసిగట్టారు. ‘మీరు ప్రచారానికి రావొద్దు, గెలిచే వరకు కాస్త దూరంగా ఉండండి’ అని సున్నితంగా పక్కన పెడుతున్నారు. అయినా కొందరు పట్టించుకోవడం లేదు.
ఏఐ చిత్రం
ఓటర్ల మదిలో ఇప్పుడు మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఈరోజు చేతులు జోడించి ఓట్లు అడుగుతున్న అభ్యర్థి మంచివారే కావచ్చు. కానీ గెలిచాక తన చుట్టూ ఉన్న ఈ వివాదాస్పద వర్గాన్ని కట్టడి చేయగలరా? అన్న సందేహం ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అధికారంలోకి రాకముందే వీరి హడావుడి ఇంతలా ఉంటే, గెలిచాక వీరి పెత్తనాన్ని భరించడం ఎవరి తరం అని ఓటర్లు గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఈసారి అభ్యర్థి గుణగణాలనే కాదు, ఆయన నీడలా తిరుగుతున్న వారి చరిత్రను కూడా ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


