ఆగిరిపల్లి : శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి పవళింపు సేవతో వైభవంగా ముగిశాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల చివరి రోజున, ఉదయం ఆలయంలోని యోగాంజనేయ స్వామి వారికి విశేష అర్చన, పంచామృత స్నపన తిరుమంజనం, శతరజిత తమలపత్రార్చన, అప్పాల నివేదన జరిపారు. సాయంత్రం స్వామివారికి పుష్పయాగం, పవళింపు సేవలను ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మేకా ఆదిత్య అప్పారావు దంపతులు, మేకా విరాజ గోపాల అప్పారావు దంపతులు, మడుపల్లి గోపాలకృష్ణ కుమార్, మడుపల్లి గోపాలకృష్ణ ప్రసాద్ సోదరులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సాయి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్య దైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి పాద మండలి దీక్షాధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ కళావేదిక వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు మాలలు సమర్పించారు. 11 రోజుల దీక్షకు గాను సుమారు 200 మంది భక్తులు అమ్మవారి మాలలు ధరించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం సిబ్బంది విధి నిర్వహణలో నిజాయతీ చాటుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు కొండపైన ధర్మఅప్పారాయ నిలయం రూమ్‌లోని స్నానపు గదిలో తన ఉంగరాన్ని బుధవారం మరిచిపోయి వెళ్లిపోయారు. కొంతసేపటికి దీన్ని గుర్తించిన ఆయన ఫోన్ ద్వారా దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది సంబంధిత గదికి వెళ్లి పరిశీలించగా ఉంగరం లభించింది. దానిని భద్రపరిచి సదరు భక్తుడికి తిరిగి అందజేశారు. సిబ్బంది చూపిన నిజాయతీ, సేవాభావంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
నూజివీడు : కర్నూలులో నిర్వహించిన ఏపీ 70వ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 బాలుర, బాలికల బాస్కెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్‌బాల్ జట్టు విజేతగా నిలిచినట్లు జట్టు కోచ్ వాకా నాగరాజు బుధవారం తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టుపై ఆడి 45–24 స్కోర్‌తో విజయం సాధించారు. అలాగే బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు జట్టు కోచ్ ఎస్ లక్ష్మి తెలిపారు. ఈ రెండు జట్లలో ప్రతిభ కనబరిచిన నూజివీడుకు చెందిన జీ జగదీష్, ఏ మనోభిరామ్, ఆర్ వాహిని, డీ ఇందుప్రియ అండర్–17 ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు.


