భీమడోలు : వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున రైతులు వరి కోతలను మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ హబీబ్ బాషా సూచించారు. భీమడోలు శివారు జాతీయ రహదారి వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, పంట పరిస్థితులను బుధవారం ఆయన భీమడోలు ఏడీఏ పి. ఉషారాజకుమారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, వర్షాల వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యాన్ని బాగా ఆరబెట్టిన తర్వాతే..
తడిసిన ధాన్యాన్ని బాగా ఆరబెట్టిన తర్వాతే విక్రయాలకు సిద్ధం చేసుకోవాలని, ధాన్యం నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ హబీబ్ బాషా రైతులకు సూచించారు. మండలవ్యాప్తంగా ఇప్పటికే 7 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయని, మరో 6 వేల ఎకరాల్లో కోతలు జరగాల్సి ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు మండలంలో 5,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పంట నష్టాన్ని తగ్గించుకునేందుకు రైతులంతా అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో ఎస్‌పీవీ ఉషారాణి, గ్రామ వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన వ్యవసాయాధికారులు


