గణపవరం : దొంగ అనే అనుమానంతో మతిస్థిమితం లేకుండా భిక్షాటన చేసుకుని జీవించే ఓ వృద్ధురాలిని దారుణంగా కొట్టి చంపిన ఘటన గణపవరం మండలం ముగ్గుళ్ల గ్రామంలో కలకలం రేపింది. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అత్తిలి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మతిస్థిమితం లేకపోవడంతో కొన్నేళ్లుగా తన అక్క కుమారుడు మంగిన మహిమరాజు వద్ద ఉంటూ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఆమెకు మతి స్థిమితం లేకపోవడంతో వివాహం కూడా కాలేదు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం మొయ్యేరు శ్మశాన వాటిక వద్ద ఆమె తలపై తీవ్ర గాయాలతో మృతి చెంది పడి ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మహిమరాజు, మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అనుమానంతో గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగ అని భావించి దాడి
దర్యాప్తు చేపట్టిన ఎస్సై మణికుమార్, గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. తమ ఇంటికి దొంగతనానికి వచ్చిందనే అనుమానంతో దుర్గాప్రసాద్ ఆమైపె విచక్షణారహితంగా దాడి చేశాడని, తీవ్ర గాయాలతో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో మృతదేహాన్ని మొయ్యేరు శ్మశాన వాటిక వద్ద పడేసి వెళ్లినట్లు ఎస్సై వెల్లడించారు. మృతురాలి అక్క కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దొంగ అనే అనుమానంతో విచక్షణారహితంగా దాడి


