వేతన వెతలు తీర్చేదెవరూ..? | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు తీర్చేదెవరూ..?

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

● 25 రోజులైనా శ్రీవారి దేవస్థానం కార్మికులకు అందని వేతనాలు

● శానిటేషన్‌ మేనేజర్‌ సెలవుతో గందరగోళం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో పారిశుద్ధ్య కార్మికులకు వేతన కష్టాలు తీరడం లేదు. నెల గడిచి 25 రోజులైనా గత నెల జీతాలు అందక కార్మికులు అల్లాడుతున్నారు. ఈ సమస్యపై ఈనెల 21న ‘సాక్షి’లో ‘శ్రీవారి సన్నిధిలో వేతన కష్టాలు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం, తాజాగా శానిటేషన్‌ మేనేజర్‌ సైతం సెలవుపై వెళ్లిపోవడంతో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

అప్పులు చేసి జీవనం

దేవస్థానంలో సుమారు 165 మంది పారిశుద్ధ్య కార్మికులు, 16 మంది సూపర్‌వైజర్లు, సాంకేతిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ మినహాయింపుల అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నెలకు సుమారు రూ.11 వేలు మాత్రమే అందుతున్నాయి. ఆ కొద్దిపాటి వేతనాలు కూడా సకాలంలో రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నిత్యావసరాల కొనుగోలుకు సైతం అప్పులు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేవస్థానం బిల్లుతో సంబంధం ఏమిటి?

దేవస్థానం బిల్లుల చెల్లింపుతో కాంట్రాక్ట్‌ సంస్థకు సంబంధం లేదు. కార్మికులకు సకాలంలో జీతాలు అందించాల్సిన బాధ్యత సంస్థదే. అలా అందేలా చూడాల్సిన బాద్యత అధికారులదే. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కార్మికులకు వేతన కష్టాలు తప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కుటుంబ పోషణ కోసం అప్పులపాలవుతున్న తమను ఆదుకోవాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement