యలమంచిలి: మండలంలోని పెదలంక గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన పలువురు కీలక టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం బుధవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. గ్రామానికి చెందిన కర్రి శ్రీను, కర్రి గంగాభవానీ, న్యాయవాది నీతిపూడి సత్యనారాయణ కుటుంబాలకు గోపి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రాబో యే రోజుల్లో పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా చేరిన కుటుంబాలకు పార్టీలో సముచిత స్థానం, తగిన గౌరవం ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీకి ప్రజల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని, ఈ చేరికలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సీఈసీ సభ్యుడు గుణ్ణం నాగబాబు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ నడపన గోవిందరాజులనాయుడు, మండల అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్‌బాబు, నాయకులు కళ్యాణం గంగాధరరావు, దీపాటి ప్రకాష్, దేవళ్ల శ్రీనివాస్, ఓలేటి రాంబాబు, నాట్ర శ్రీను, మల్లాడి రాంబాబు, ఓలేటి దుర్గా ప్రసాద్, యల్లంకి ధనరాజు తదితరులు పాల్గొన్నారు.
పెదలంకలో టీడీపీకి షాక్


