మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి
దెందులూరు: పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించడం ఆందోళన కలిగిస్తోందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. భోగాపురం, కొప్పాక, జగన్నాథపురం, గార్లమడుగు, దుగ్గిరాల తదితర గ్రామాల్లో నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై ఆయన స్పందించారు. బుధవారం ఆర్డీఓను కలిసి నామినేషన్ల తిరస్కరణను గల కారణాలను తెలపాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి నామినేషన్‌ను సమగ్రంగా, నిష్పక్షపాతంగా పరిశీలించి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగాలన్నారు. నామినేషన్ల తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకూ చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, ఏలూరు రూరల్ మండల అధ్యక్షుడు తెర ఆనంద్, సర్పంచ్ అభ్యర్థులు సునీత దేవానంద్, నాయకులు ఉన్నారు.


