రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ

Nov 25 2026 9:42 AM | Updated on Nov 25 2026 9:42 AM

రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ గృహిణిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు వీరంపాలెంలో కార్తీక పౌర్ణమి శ్రీవారి గ్రామోత్సవం

కుక్కునూరు: మండలంలోని అమరవరం గ్రామ సమీపంలో మంగళవారం ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కునూరు నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ రాజీవ్‌నగర్‌ – అమరవరం మధ్యలోని మలుపు వద్ద అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

చాట్రాయి: గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై డి. రామకృష్ణ సోమవారం తెలిపారు. చాట్రాయి గ్రామానికి చెందిన గడ్డం స్వప్న, రంగపూరి రాంబాబుల ఇళ్ల మధ్య 2022 జూన్‌ 6న డ్రైనేజీ తవ్వుతుండగా, తమ స్థలంలో గోడ కట్టవద్దని స్వప్న అభ్యంతరం తెలిపారు. దీంతో ఆగ్రహించిన రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశాడు. గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వప్న ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కె. ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి, సాక్షుల వాంగ్మూలాలతో న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణ అనంతరం తిరువూరు జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ నిందితుడిని దోషిగా నిర్ధారించి, ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: మండలంలోని వీరంపాలెం శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి, పారిశ్రామికవేత్త చక్కా సత్యనారాయణ దంపతులు విశ్వేశ్వర స్వామివారికి 12 నదీ జలాలతో రుద్రాభిషేకం చేసి, పరమేశ్వరుని సన్నిధిలో అఖండ జ్యోతిని వెలిగించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. పీఠం ఆవరణలోని స్పటిక లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు విరివిగా తరలివచ్చారు. సాయంత్రం భూప్రస్తార జ్యోతిర్లింగార్చన, జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పీఠం ప్రతినిధులు ఈమని శశికుమార్‌, గరిమెళ్ళ కృష్ణ సందీప్‌ పర్యవేక్షించారు.

ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీవారి గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కన్నులపండువైంది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

క్షీరారామంలో జ్వాలా తోరణం

పాలకొల్లు సెంట్రల్‌: కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి 8 గంటలకు పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో జ్వాలా తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా గర్భగుడి వెనుక ఉన్న కార్తికేయునికి, అనంతరం గర్భాలయంలో స్వామివారికి ప్రధానార్చకులు కిష్టప్ప, అనిల్‌, వీరబాబు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత జ్వాలా దీపంతో ఆలయ ప్రదక్షిణ చేసి, ఉత్సవమూర్తులను ముఖద్వారం వద్దకు తీసుకువచ్చి జ్వాలా తోరణాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాపాక శ్రీనివాసరావు, ట్రస్ట్‌ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement