● భోగాపురంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
● ఉద్దేశపూర్వకంగా తిరస్కరణపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి విమర్శ
సాక్షి, టాస్క్ ఫోర్స్ భోగాపురంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం దారుణమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని, కూటమికి ప్రజల్లో ఆదరణ, నమ్మకం లేకపోవడం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భోగాపురం పంచాయతీ కార్యాలయానికి వెళ్తున్న అబ్బయ్యచౌదరి వాహనాన్ని పోలీసులు, కూటమి కార్యకర్తలు అడ్డుకున్నారు. కారుపై దాడికి యత్నించగా, కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఆయనను లోనికి అనుమతించారు. అనంతరం అబ్బయ్యచౌదరి జిల్లా కలెక్టర్, ఆర్‌డీఓలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
టిక్ మార్క్ పెట్టలేదంటూ..
పెదవేగి మండలం భోగాపురం సర్పంచ్ పదవికి వైఎస్సార్‌సీపీ బలపరిచిన మండపాక సునీత, వార్డు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పరిశీలన సందర్భంగా నామినేషన్ పత్రంలో పదవి వద్ద టిక్ పెట్టలేదంటూ సర్పంచ్ నామినేషన్‌ను, వివిధ కారణాలతో వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించారని సునీత ఆరోపించారు. తాను స్పష్టంగా టిక్ పెట్టానని, గంటల తరబడి ప్రశ్నించిన తర్వాత రిటర్నింగ్ అధికారి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారని తెలిపారు. వార్డు సభ్యులను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు గురిచేశారని అన్నారు.
ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి
విలేకరులతో అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ, నియోజకవర్గంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, గతంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలోనూ దాడులు, నామినేషన్ల చింపివేత వంటి ఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని, భవిష్యత్తులో తమ ప్రభుత్వమే వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు మరీదు బాలస్వామి, పామర్తి రంగారావు, దిమ్మిటి రమేష్, సుబ్బారావు, మండపాక ప్రభాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు ఉన్నారు.


