కూటమిలో లుకలుకలు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో లుకలుకలు

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

● ర్యాలీలో కన్పించని బీజేపీ ఎంపీ పాకా

● తన కుమారుడికి టికెట్‌ ఇవ్వకపోవడమే కారణమా!

● స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ

భీమవరం: భీమవరం మున్సిపల్‌ ఎన్నికల ప్రచార ముగింపు రోజైన మంగళవారం కూటమి నాయకుల మధ్య అనైక్యత మరోసారి బయటపడింది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులతో కూటమి నేతలు భారీ ర్యాలీకి ప్రణాళిక రూపొందించారు. జనసేనకు చెందిన ఛైర్‌పర్సన్‌ అభ్యర్థితో పాటు మూడు పార్టీల కౌన్సిలర్‌ అభ్యర్థులు, అగ్రనాయకులు, శ్రేణులు ఇందులో పాల్గొనాలని నిర్ణయించారు. అయితే, ఈ ర్యాలీకి బీజేపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

తొలి నుంచీ భేదాభిప్రాయాలు

మున్సిపాలిటీలోని 52 వార్డుల సీట్ల పంపకంలో తొలి నుంచీ భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. బీజేపీకి తక్కువ సీట్లు కేటాయించి అవమానించారని ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆయన, నామినేషన్ల చివరి రోజున దాదాపు 33 మంది బీజేపీ నేతలతో నామినేషన్లు వేయించారు. వారిలో శ్రీనివాసవర్మ మేనల్లుడు కలిదిండి వినోద్‌కుమార్‌వర్మ 9వ వార్డు నుంచి, ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ తనయుడు పాకా ధనుంజయ 39వ వార్డు నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. అనంతర పరిణామాల్లో వినోద్‌కుమార్‌వర్మ ఏకగ్రీవంగా ఎన్నికవగా, ధనుంజయకు కనీసం బీజేపీ ‘బీ–ఫాం’ (మ్యాండేట్‌) కూడా దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

ఐక్యతా సమావేశానికి బీజేపీ దూరం

ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల భీమవరంలో నిర్వహించిన కూటమి ఐక్యత సమావేశానికి బీజేపీ నేతలు దూరంగా ఉన్నారు. తాజాగా తన కుమారుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందునే కూటమి ర్యాలీకి ఎంపీ పాకా గైర్హాజరయ్యారని, ఇది బీజేపీలోని లుకలుకలకు నిదర్శనమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈనెల 26న జరిగే ఎన్నికల్లో కూటమిలో ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement