● బైక్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి
● సానారుద్రవరంలో విషాదఛాయలు
కలిదిండి (కై కలూరు): అతివేగం, నిర్లక్ష్యం వెరసి ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. గుండెలవిసేలా రోదిస్తున్న ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈ హృదయవిదారక ఘటన కలిదిండి మండలం సానారుద్రవరం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుంపటి శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు యశ్వంత్ (4) ఉన్నారు. యశ్వంత్ కలిదిండిలోని శశి హైస్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి ఎదురుగా ఉన్న రహదారిపై పండ్లు విక్రయించే ఆటో ఆగింది. కుమారుడితో కలిసి తండ్రి రోడ్డు దాటి పండ్లు కొనుగోలు చేస్తుండగా, బాలుడు తండ్రి చేయి విడిపించుకుని ఇంటికి వెళ్లేందుకు ఒక్కసారిగా రోడ్డుపైకి పరుగు తీశాడు. అదే సమయంలో జాతీయ రహదారి నంబరు 19పై ఎస్‌ఆర్‌పీ అగ్రహారం నుంచి కోరుకొల్లు వైపు ప్యాషన్ బైక్‌పై అతివేగంగా వస్తున్న పసలపూడి వీరబాబు బాలుడిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. తండ్రి హుటాహుటిన భీమవరంలోని ఇంపీరియల్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి మృతదేహానికి కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కలిదిండి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


