ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడు ఈతకోట శ్రీనివాసరావు బూట్లతో ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా అర్చకులు అర్చకులు మహాదాస్యం రామచంద్రాచార్యులపై అమానుషంగా దాడి చేసిన ఘటనపై తాళ్లూరు మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదాచార్యులు తీవ్రంగా స్పందించారు. బాధిత అర్చకులకు తగిన న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ దాడి విషయం తెలుసుకున్న పీఠాధిపతి శిష్య సమేతంగా ఆలయానికి విచ్చేశారు. అర్చకులు చందు స్వామిపై జరిగిన దాడిని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆలయ మర్యాదలను ఆయన తిరస్కరించారు. ఇది ఒక అర్చకుడిపై జరిగిన దాడి కాదని, సాక్షాత్తు పెరుమాళ్లపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై, అర్చక లోకంపై జరుగుతున్న ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సతీష్ కుమార్‌తో మాట్లాడుతూ, ఈ ఘటనపై విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ఈవో స్పందిస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చారు.


