కూటమిలో రెబెల్స్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమిలో రెబెల్స్‌

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

కూటమిలో రెబెల్స్‌

తణుకు.. స్వతంత్రులతో వణుకు

తాడేపల్లిగూడెం.. జనసేనకు గండం

సాక్షి, భీమవరం : పురపోరులో రెబల్స్‌ జోరు కూట మిని బేజారెత్తిస్తోంది. సీటు ఆశించి భంగపడిన వా రు స్వతంత్రులుగా బరిలో సవాల్‌ చేస్తున్నారు. తగ్గేది లేదంటూ కూటమి అభ్యర్థులకు ధీటుగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో రెబల్స్‌ దూసుకుపోతుండటం కూటమిని కంగారెత్తిస్తోంది.

వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు

సూపర్‌ సిక్స్‌కు ఎగనామం, పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రజల నుంచి వైఎస్సార్‌సీపీకి లభిస్తున్న ప్రజాదరణ కూటమిని బెంబేలెత్తిస్తోంది. ఓటమి భయంతో ఉన్న కూటమి నేతలకు రెబల్స్‌ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. తమ ఓట్లను చీలిస్తే పరాభవం తప్పదన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. నయానో భయానో నచ్చజెప్పి రెబల్స్‌ను బుజ్జగించి ప్రచారాలు చేయకుండా సైలెంట్‌ చేసే ప్రయత్నాలు ఇంకా చేస్తున్నట్టు వినిపిస్తోంది.

భీమవరం.. బీజేపీ అసంతృప్తి స్వరం

జిల్లా కేంద్రం భీమవరం మున్సిపాల్టీలో మిత్రపక్షం బీజేపీ తీవ్ర అసంతృప్తిలో ఉంది. స్వయంగా ఒక వార్డులో బీజేపీకి చెందిన సీనియర్‌ నేత, ఎంపీ పాకా సత్యనారాయణ తనయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. వార్డుల పంపకాల్లో టీడీపీ, జనసేన ఇచ్చిన ఝలక్‌తో అన్ని వార్డుల్లో ఫ్రెండ్లీ పోటీచేస్తామంటూ మీడియా ముందు హడావిడి చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తర్వాత సైలెంట్‌ అయిపోయారంటూ బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే భీమవరంలో 48 వార్డులకు నాలుగు వార్డుల్లో బీజేపీ, 21 వార్డుల్లో జనసేన, 23 వార్డుల్లో టీడీపీ పోటీలో ఉన్నాయి. కూటమి పక్షాలకు చెందిన 20 మంది వరకు స్వతంత్రులు రెబల్స్‌గా పోటీలో ఉన్నారు. కౌన్సిలర్‌ సీటు ఆశించి భంగపడిన వారు కొందరైతే, తాము సూచించిన వారికి కాకుండా వేరొకరికి పోటీలో నిలిపారనే అసంతృప్తితో రెబల్స్‌ను బరిలోకి దింపిన వారు మరికొందరు. ప్రధానంగా వన్‌టౌన్‌లో పలు వార్డుల్లో రెబల్స్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో కూటమి నేతలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.

పాలకొల్లు.. నాయకులు ఘొల్లు

పాలకొల్లులో 43 వార్డులకు టీడీపీ 33, జనసేన ఏడు, బీజేపీ మూడు వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. కూటమి నుంచి చైర్‌పర్సన్‌ పదవిని ఆశించిన టీడీపీ నేత, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ కర్నేని రోజా రమణిని ముందుగానే నామినేషన్‌ వేశారు. అయితే సీటు విషయంలో టీడీపీ ఝలక్‌ ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలవడంటో టీడీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థికి ధీటుగా రోజా రమణి ప్రచారం కూటమి వర్గాలకు మింగుడు పడటం లేదు. రెబల్‌ నుంచి తమ చైర్‌పర్సన్‌ అభ్యర్థికి గట్టిపోటీనే ఎదురవుతున్నట్టు వారు చర్చించుకుంటున్నారు. స్వతంత్రులు 28 మంది పోటీలో ఉండగా దాదాపు ఎనిమిది వార్డుల్లో రెబల్స్‌ నుంచి కూటమికి సవాల్‌ ఎదురవుతోంది.

తణుకులో బీజేపీ మహిళ విభాగం నాయకురాలు పోటీ చేస్తున్న ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిని బరిలో నిలపడంతో పాటు ఆమెకు వ్యతిరేకంగా టీడీపీకి చెందిన నేత ఒకరు స్వయంగా ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో మొత్తం 42 వార్డులకు టీడీపీ 29, జనసేన తొమ్మిది, బీజేపీ నాలుగు వార్డుల్లో పోటీలో ఉన్నాయి. నాలుగు మంది వరకు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. బీజేపీకి కేటాయించిన ఒక వార్డులో బీజేపీకి చెందిన అభ్యర్థితో పాటు టీడీపీ నుంచి అభ్యర్థి పోటీలో ఉండటం గమనార్హం. రెండు వార్డుల్లో టీడీపీకి చెందిన వారే రెబల్స్‌గా పోటీలో ఉన్నారు.

స్వతంత్రుల ప్రచారం.. నేతల కలవరం

జిల్లాలో పలుచోట్ల ప్రభావితం చేసే స్థాయిలో రెబల్స్‌

పాలకొల్లులో కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థికి రెబల్‌ గుబులు

భీమవరంలోని ఓ వార్డులో ఇండిపెండెంట్‌గా ఎంపీ తనయుడు

గూడెంలోని పలు వార్డుల్లో రెబల్స్‌గా జనసేన ఆశావహులు

తణుకులోనూ కూటమికి దడ పుట్టిస్తున్న స్వతంత్రులు

తాడేపల్లిగూడెంలో 45 వార్డులకు టీడీపీ 22, జనసేన 19, బీజేపీ నాలుగు వార్డుల్లో పోటీలో ఉన్నాయి. 24 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది కూటమి రెబల్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. 33వ వార్డులో టీడీపీతో పాటు జనసేన అభ్యర్థి పోటీలో ఉండగా రెండు పార్టీలు తమ అభ్యర్థులకు మ్యాండెట్‌లు ఇవ్వడం గమనార్హం. 46వ వార్డులో టీడీపీ రెబల్‌గా పోటీలోని అభ్యర్థి కూటమి అభ్యర్థికి గట్టి పోటీనే ఇస్తున్న పరిస్థితి. తమకు కేటాయించిన పలు వార్డుల్లో జనసేన నేత అండతో ఆ పార్టీకి చెందిన వారు రెబల్స్‌గా పోటీలో ఉండి తమకు చేటు చేయాలని చూస్తున్నారని టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement