తాడేపల్లిగూడెం : జిల్లాకు భౌగోళికంగా కేంద్ర స్థానంగా ఉన్న తా డేపల్లిగూడేన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతానని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గొర్రెల శ్రీనివాసరావు తెలిపారు. దీర్ఘకాలంగా పట్టణాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి రావడంతో పాటు అనుభవం ఉండటం వల్ల పట్టణంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తనకు ప్రజల ఆశీర్వాదం ల భిస్తే, ఇచ్చిన మాట ప్రకారం పట్టణాన్ని తీర్చిదిద్దుతానన్నారు. సమస్యలు, పరిష్కారానికి భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ వంటి విషయాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
? పట్టణంలో ఏఏ సమస్యలు గుర్తించారు
పట్టణం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి దోమలు. దోమలరహిత పట్టణంగా తీర్చిదిద్దుతా, వ్యాపార కేంద్రం, పరిసరాల గ్రామాలకు పెద్ద కూడలి కావడంతో వచ్చి, వెళ్లే వారి సంఖ్య 75 వేల వరకు ఉంటుంది. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పటివరకు లేదు. పట్టణంలోని వాడకం నీరు బయటకు వెళ్లేందుకు డ్రెయిన్లు ఉన్నా మురుగును బయటకు పంపడానికి అవుట్‌లెట్ లేదు. అవుట్‌లెట్ నిర్మించి మురుగుకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాను. 365 రోజులూ శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్య ఉంది. దీని కోసం చేపట్టిన రెండో వేసవి జలాశయం పని పోలవరం ప్రాజెక్టు మాదిరి సాగుతోంది. ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తా.
? శివారు ప్రాంతాలు, విలీన గ్రామాలను ఏం చేస్తారు
పురపాలక సంఘం ఏర్పడినప్పుడు రెవెన్యూ గ్రా మాలైన జువ్వలపాలెం, కడకట్ల, తాళ్ల ముదునూరుపాడు, యాగర్లపల్లిలను విలీనం చేశారు. నేటికీ అవి పల్లెల మాదిరిగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. తాజాగా కుంచనపల్లి, కొండ్రుపోలు, ఎల్.అగ్రహారం, పడాల, ప్రత్తిపాడు గ్రామాలను విలీనం చేశారు. వీటి అభివృద్ధికి, గతంలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తాను.
? చైర్మన్‌గా అవకాశం రావడంపై మీ అభిప్రాయం
మున్సిపాలిటీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి మాత్రమే బీసీ జనరల్ రిజర్వేషన్ ప్రకారం చైర్మన్ అవకాశం వచ్చింది. అన్ రిజర్వుడ్‌గా ఉన్న మున్సిపాలిటీలో కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన నాకు అవకాశం కలిగించడం మహాదానందంగా ఉంది. వైఎస్సార్‌సీపీలో ఉండటం వల్ల నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం సహకారంతో ఈ అవకాశం దక్కింది. తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా.
? కూటమి పాలనలో మీరు చైర్మన్‌గా గెలిచినా అభివృద్ధి ఎలా చేస్తారు
ప్రజలిచ్చిన అధికారాన్ని గౌరవించడం సంస్కారం. మున్సిపల్ ఆదాయం, ఆర్థిక సంఘ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక గ్రాంట్లు ద్వా రా అభివృద్ధికి కృషి చేస్తాను.
? విజయంపై మీ ధీమా
పట్టణంలో చైర్మన్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. రాజ్యాఽధికారం కావాలని ఆశించే బీసీ సామాజిక వర్గాలు, మంచి వ్యక్తిని అక్కున చేర్చుకొనే విశాల హృదయం ఉన్న ఇతర సామాజికవర్గాలు తప్పనిసరిగా చైర్మన్‌గా ఆదరిస్తారు. ఓట్లతో అందలం ఎక్కించడానికి సాయం చేస్తారు. కన్వీనర్ రఘురాం వ్యూహం, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న విశ్వాసం గెలిపిస్తుందనే నమ్మకం ఉంది.
? మీ కుటుంబ నేపథ్యం
తండ్రి వెంకటసత్యనారాయణ, తల్లి లక్ష్మీనరసమ్మ, నలుగురు తమ్ముళ్లు. ఇటీవలే ఒక సోదరుడు అమరుడయ్యారు. అమ్మ రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసి వార్డును అభివృద్ధి చేశారు. వారి ఆశీస్సులు, పార్టీ నాయకుల మార్గదర్శకత్వం నాకు శ్రీరామరక్ష.
దోమలరహిత పట్టణంగా నిలుపుతా..
మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా..
రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పూర్తి చేస్తా..
వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి గొర్రెల శ్రీనివాసరావు


