● కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత
● భీమవరంలో అధ్వానంగా రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు
భీమవరం : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భీమవరం పట్టణంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఈ పట్టణం విద్యా, వైద్య, వాణిజ్య రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. తాడేరు, రాయలం, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాల విలీనంతో వార్డుల సంఖ్య 39 నుంచి 52కు, ఓటర్ల సంఖ్య 1.23 లక్షల నుంచి 1.45 లక్షలకు పెరిగింది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం సంపన్నులు, ప్రజాప్రతినిధులు నివసించే ప్రాంతాల్లోనే రోడ్లు, డ్రెయినేజీ పనులు జరుగుతున్నాయని, శివారు ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 360 మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఉండటంతో చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదు. హౌసింగ్ బోర్డు కాలనీ, బలుసుమూడి, గునుపూడి తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీలలో పూడికతీత లేక దుర్గంధం, దోమల బెడద తీవ్రమైంది.
పార్కులు ఘోరం
మారుతీనగర్, బ్యాంక్ కాలనీ, ఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లోని మున్సిపల్ పార్కులు నిర్వహణ లేక విషసర్పాలకు నిలయాలుగా మారాయని ప్రజలు వాపోతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా అభివృద్ధి పేరుతో కూటమి నేతలు ఓట్లు అడగడంపై పట్టణ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక భీమవరం పట్టణంలో అభివృద్ధి కానరావడం లేదు సరికదా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇటువంటి తరుణంలో కూటమి నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటెయ్యాలంటూ ప్రజల వద్దకు వెళ్లడం విడ్డూరంగా ఉంది.
– ఏఎస్ రాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, భీమవరం
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హా మీలను విస్మరించి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళుతున్న కూటమి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధం ఉన్నారు. అభివృద్ధి, గత ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని గాలికి వదిలేయడంపై అంతటా అసంతృప్తి ఉంది. కూటమి పార్టీలను చిత్తుగా ఓడించడం ఖాయం
– కోడే విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, భీమవరం


