సాక్షి, భీమవరం: జిల్లాలో మలివిడత నాలుగు మున్సిపాల్టీలు, తొలి విడత 90 పంచాయతీలకు పోలింగ్ సమీపిస్తుండటంతో ప్రచారం జోరందుకుంది. పల్లె, పట్టణం ఎక్కడ చూసినా మైకుల హోరే. ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహిస్తూ, వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి వైఫల్యాలు, సూపర్‌సిక్స్ హామీలకు ఎగనామం, ప్రభుత్వ వ్యతిరేకత అస్త్రంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని గుర్తు చేస్తూ, తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
నాలుగు రోజులే.. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాల్టీలు, వాటి పరిధిలోని 178 వార్డులు, అలాగే తొలి విడతలోని నరసాపురం డివిజన్‌లోని ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని 90 పంచాయతీలు, వాటి పరిధిలోని 1,006 వార్డులకు ఈనెల 26న పోలింగ్ జరుగనుంది. నాలుగు రోజులు మాత్రమే గడువుండటంతో అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు.
వైఎస్సార్‌సీపీ దూకుడు
● తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి గొర్రెల శ్రీనివాస్ పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం వెన్నంటి నడుస్తూ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
● భీమవరం వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి యాదాల వెంకట మాధవీలత 1, 2, 3, 4, 5, 23, 51, 52, 49 వార్డుల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. మాజీ మంత్రి ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ప్రచారంలో పాల్గొన్నారు.
● తణుకులో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి ఇండుగపల్లి బలరామకృష్ణ పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆలయాలు, మసీదులతోపాటు 23, 31, 40 తదితర వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, పట్టణాధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి ప్రచారంలో పాల్గొన్నారు.
● పాలకొల్లులో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి సందక ఉమాశైలజ పట్టణంలోని 1, 3, 18 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి, నాయకులు గుణ్ణం నాగబాబు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ప్రచారంలో ఓట్లు అభ్యర్థించారు.
● అలాగే గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సాను భూతిపరులైన అభ్యర్థుల విజయానికి పార్టీ నేతలు ప్రచారాలు సాగిస్తున్నారు.
పల్లె.. పట్టణం.. ప్రచారం
నాలుగు మున్సిపాలీలు, 93 పంచాయతీలకు 26న పోలింగ్
ముమ్మరంగా ప్రచారం
కూటమి వైఫల్యాలు, ప్రజావ్యతిరేకతే వైఎస్సార్‌సీపీ అస్త్రం


