● పట్టణంలో డంపింగ్ యార్డుకు కృషి
● కనీస సౌకర్యాలకు ప్రాధాన్యం
● వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌చైర్‌పర్సన్ అభ్యర్థి యాదాల మాధవీలత
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కేంద్రం భీమవరం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు పట్టణ ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమివ్వడమే లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బరిలో నిలిచినట్టు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని యాదాల వెంకట మాధవీలత అన్నారు. పట్టణాన్ని పీడిస్తున్న పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి ప్రధానమైన డంపింగ్ యార్డు ఏర్పాటుకు కృషి చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. భీమవరం ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ నాయకుల మద్దతుతో తాను చైర్‌పర్సన్ అభ్యర్థిగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలో పుట్టి పెరిగిన తాను ప్రజల రుణం తీర్చుకుంటూ.. భీమవరాన్ని అభివృద్ధి పథంలో న డిపి జిల్లా కేంద్రానికి మ రింత పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తానని ‘సాక్షి’తో ముచ్చటించారు.
? మీ కుటుంబ నేపథ్యం
తల్లిదండ్రులు కృష్ణారావు, సుధారాణి. భర్త యాదాల ప్రసాదరావు వ్యాపార రంగంలో ఉన్నారు. భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ కోశాధికారిగా ఆయన సేవలు అందిస్తున్నారు. నేను గృహిణిగా ఉన్నాను. మాకు ఒక కుమార్తె, కుమారుడు. వారు చదువుకుంటున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ అనంతరం వైఎస్సార్‌సీపీ లో కొనసాగుతున్నాం.
? మీరు గెలిచాక ఏ అభివృద్ధి పనులు చేపడతారు
భీమవరం పట్టణంలో పలు వార్డుల్లో రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. భీమవరం మున్సిపాలిటీకి ఆదాయం ఉన్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. మున్సిపల్ నిధులను ఉపయోగించి ప్రతి వార్డులో రోడ్లు, డ్రెయిన్లను అభివృద్ధి చేస్తాను. అలాగే పలు వార్డుల శివారు ప్రాంత ప్రజలకు తాగునీరు అందడం లేదు. శివారు ప్రాంతాలకు, విలీన గ్రామాలకు పూర్తిస్థాయిలో పైపులైన్లు వేసి సురక్షిత తాగునీటి సరఫరాకు కృషిచేస్తాను.
? మహిళల సంక్షేమానికి ఏమి చేస్తారు
పట్టణంలోని మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా వ్యాపార అవకాశాలు తీసుకువచ్చి వారు ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందిస్తాను. స్ట్రీట్ మార్కెట్లు వంటివి ఏర్పాటుచేసి మహిళలు చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేలా ఊతమిస్తాను.
? ప్రజలకు ఎలాంటి సేవలందిస్తారు
మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తనను గెలిపిస్తే భీమవరం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన పనులను వేగంగా చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి త్వరితగతిన స్పందిస్తాను. వేగంగా స్పందిస్తాను. తాను గృహిణిగా ఉండటం వల్ల పూర్తి సమయాన్ని పట్టణ ప్రజల సేవకు, అభివృద్ధి పనులకు కేటాయిస్తాను.


