వైఎస్సార్‌సీపీ తణుకు చైర్మన్ అభ్యర్థి బలరామ్
తణుకు అర్బన్: తణుకులో కూటమి నేతలు అప్రజా స్వామికంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఇండుగపల్లి బలరామకృష్ణ విమర్శించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయంలో 16, 21 వార్డుల్లోని తమ పార్టీ అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి నామినేషన్లను ఉపసంహరింపజేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేకే కూటమి నేతలు ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ నెల 26న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 16, 21 వార్డుల ఓటర్లు కౌన్సిలర్ అభ్యర్థులకు కాకుండా, కేవలం చైర్మన్ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన నిమిత్తం ఎస్‌ఆర్‌ఎం ప్రత్యేక బృందం ఈ నెల 28వ తేదీ వరకు పర్యటించనుంది. బృంద సభ్యులు జి. నరసింహ నాయక్, సి.హెచ్. శిరీష, జి. ప్రసన్న కుమార్ గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. రవిబాబు, ఇతర అధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. గర్భిణుల నమోదు, హై–రిస్క్ కేసుల గుర్తింపు, సాధారణ ప్రసవాల పెరుగుదల, జనని సురక్ష యోజన నిధులు, టీకాల లక్ష్యాలు, కోల్డ్ చైన్ నిర్వహణ రికార్డులను బృందం తనిఖీ చేయనుంది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ పర్యటనలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల పనితీరు, 30 ఏళ్లు దాటిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా నివారణ చర్యలు, టీబీ రోగులకు పోషకాహార భృతి పంపిణీ తీరును సమీక్షిస్తారు. సమావేశంలో జిల్లా అధికారులు డాక్టర్ వి.ప్రసాద్, డాక్టర్ సేవా సుధారాణి, డాక్టర్ రత్న కిషోర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండల, జిల్లా ప్రజా పరిషత్ పరోక్ష ఎన్నికల నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు త్వరలో ప్రత్యేక నోటిఫికేషన్ వెలువడనున్నందున.. నవంబరు 19, 20 తేదీల్లో జరగాల్సిన ఎంపీపీ కో–ఆప్షన్ ఎన్నికలు, 20, 21 తేదీల్లోని జెడ్పీ కో–ఆప్షన్ ఎన్నికలను నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. శుక్వారం మధ్యాహ్నం ఒంటి గంటకు జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశౠరు. ఇప్పటికే జారీ చేసిన నోటీసులు చెల్లుబాటు అవుతాయని, ఈ సవరణలను సభ్యుల దృష్టికి తీసుకురావాలని ప్రిసైడింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
వేలేరుపాడు: కూటమి కుట్రలు, కుతంత్రాలను ఎదురించి ,స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీపీలను గెలుపొందడం పై మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. గురువారం మండల పార్టీ అధ్యక్షుడు కేశగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విజయం కార్యకర్తులు, స్థానిక నేతల సమష్టి కృషి అని కొనియాడారు. ఈ సందర్భంగా గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అభినందించారు. కూటమి ప్రభుత్యం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులపై అనేక రకాలుగా దాడులు చేసినా సరే ఎవరు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వారి కుట్రలకు ఎదురొడ్డి నిలిచి గెలిచారని, ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు కుంజా కుమారి, ఎంపీపీ బాడిసి వెంకమ్మ, నాయకులు కామినేని వెంకటేశ్వర రావు,గుడ్డేటి భాస్కర్, కొమ్మరాజు రాంబాబు, బద్దె ప్రేమ్ కుమార్, సత్తిరాజు, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.


