ఏలూరు టౌన్: స్థానిక ఆర్‌ఆర్‌పేట ప్రాంతంలో గుర్తు తెలియని అగంతకుడు ఒక వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు అపహరించాడు. బాధితురాలు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం ఏలూరు ఆర్‌ఆర్‌పేట ప్రధాన రహదారిపై త్రినాథ్ ఫ్యాషన్స్ పక్క వీధిలో మడిచర్ల కుమారి అనే వృద్ధురాలు తన ఇంటివద్ద గురువారం ఉదయం మొక్కలకు నీరు పోస్తుండగా... అగంతకుడు అడ్రస్ అడుగుతూ వృద్ధురాలి సమీపానికి వచ్చి, ఒక్కసారిగా ఆమె మెడలోని 9 కాసులు (72 గ్రాముల) బంగారు గొలుసును చోరీ చేశాడు. బంగారు గొలుసు విలువ సుమారు రూ.10 లక్షల వరకూ ఉంటుందని బాధితురాలు వాపోతున్నారు. ఏలూరు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాడేపల్లిగూడెం రూరల్ : కడియద్ద గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త మద్దాల మెంటరాజు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వడ్డి రఘురాం నాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రఘురాం సూచించారు. నాయకులు దారపురెడ్డి శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీమవరం: జేఎన్‌టీయూకే ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్ మీట్‌లోని వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి వి.కల్యాణిబాయి బంగారు పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ కేవీ మురళీకృష్ణంరాజు తెలిపారు. గురువారం పతకం సాధించిన కల్యాణిబాయిని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఈ నెల 14, 15 తేదీలలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సెంట్రల్ జోన్ పోటీల 49 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్.హరిమోహన్, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ జి.సారిక, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్.దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని పురాతన వంతెన వద్ద రోడ్డు పక్కన మట్టి కట్ట భారీగా కోతకు గురైంది. ఇటీవల వరుస తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహించగా, నీటి ఉధృతికి పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. కొండవాగుల నీరంతా కడెమ్మ స్లూయిజ్ ద్వారా గోదావరిలోకి చేరుతుండగా, స్లూయిజ్–కడెమ్మ వంతెన మధ్య ప్రవాహ వేగానికి భారీ గొయ్యి ఏర్పడింది. మరోవైపు రోడ్డును ఆనుకుని నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మట్టి కట్ట జారిపోయింది. వర్షాలు, వరదల ప్రభావంతో కోత మరింత తీవ్రమైంది. అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టకపోతే రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న 33వ వార్షిక సప్తాహ మహోత్సవాలు గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. లోక కల్యాణార్థం, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని, ప్రకతి వైపరీత్యాల నుంచి రక్షణ కలగాలని ఆకాంక్షిస్తూ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. అనంతరం సప్తాహ దీక్షా విరమణ గావించి, ఏడు రోజుల పాటు నిర్విరామంగా భజనలు, నామ సంకీర్తనలు చేసిన నాలుగు భజన మండలి సభ్యులను ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు.


