తాడేపల్లిగూడెం (టీఓసీ): వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ కె. ధనుంజయరావు గ్రంథాలయ వారోత్సవాల ఐదో రోజు స్థానిక ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయ సద్వినియోగం, గురువుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. గ్రంథాలయ అధికారి సాయిబాబా పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్ నినో – ప్రకృతి వైపరీత్యాలు అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కోపల్లె శ్రీనివాస్ ప్రదర్శించిన ‘అన్నదాత’ ఏకపాత్రాభినయం ఆలోచింపజేయగా, వీసీ ఆయనను సత్కరించారు. అనంతరం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చింతా ప్రసాద్, సభ్యులు వీసీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా సంస్థ అధ్యక్షురాలు మల్లిపూడి షర్మిల, విద్యార్థులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం తేనెటీగల పెంపకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వెంకట్రామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానానికి చెందిన ఎస్.ఆదర్శ తెలిపారు. వెంకట్రామన్నగూడెంలో జరుగుతున్న శిక్షణలో భాగంగా బుధవారం పలు అంశాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. తేనెటీగల్లో వచ్చే పురుగులు, వ్యాధులు, వాటి నివారణ చర్యలు, తేనెటీగల కాలనీల సమర్థవంతమైన నిర్వహణ, రాయల్ జెల్లీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై రైతులకు ప్రయోగాత్మక విషయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు సీహెచ్ రూత్ తదితరులు మాట్లాడారు.
వీరవాసరం: పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–17 బాలబాలికల బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపికలను గురువారం తణుకు ఎస్వీకేపీ ఉమెన్స్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు గుత్తుల నర్మద, మహమ్మద్ ఖుద్ధుస్ తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని వారు కోరారు.
తాడేపల్లిగూడెం: గూడెం – నవాబుపాలెం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు మృతి చెందినట్లు గూడెం రైల్వే పోలీసులు తెలిపారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై పి. అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదని ఆయన వెల్లడించారు.


