తాడేపల్లిగూడెం: ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో నివారించుకోవచ్చని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె. ధనుంజయరావు తెలిపారు. వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో, అఖిల భారత సాంకేతిక విద్యామండలి సహకారంతో ఫౌండేషన్స్ అండ్ అప్లికేషన్స్ అఫ్ ఏఐ డేటా సైన్సు ఫర్ ఇంజనీరింగ్ అండ్ స్మార్ట్ ఆగ్రో సిస్టమ్స్ అనే అంశంపై మంగళవారం శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా వ్యవసాయ సమస్యలకు పరిష్కారం చూపగలమన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా కళాశాల మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగంలో వివిధ కారణాల వల్ల దిగుబడులు తగ్గడం, నిల్వ ఉంచుకోడానికి అవసరమైన సౌకర్యాల లోపం, ఎగుమతులలో ఇబ్బందులు, అధిక పురుగుమందుల వినియోగం వంటి అంశాలను వీసీ ప్రస్తావించారు. కచ్చితమైన వ్యవసాయ పద్ధతుల అవసరం ఉందని, దాని కోసం వ్యవసాయ రంగంలో ఏఐ, డేటా సైన్సు లాంటి అధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపాల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


