అమ్మో.. ఆక్వాన్‌ | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఆక్వాన్‌

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

ఆక్వాకు ముప్పు

భీమవరం అర్బన్‌: ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా పడక ఇబ్బందులు పడిన రైతులకు, ఇటీవల అకస్మాత్తుగా విరుచుకుపడిన అర్నబ్‌, మురసు తుపాన్లతో పాటు యనమదుర్రు డ్రెయిన్‌కు వచ్చిన వరద పోటు కోలుకోలేని దెబ్బతీశాయి. భీమవరం మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన కొత్తపూసలమర్రు, దొంగపిండి, లోసరి, నాగిడిపాలెం, తోకతిప్ప, దెయ్యాలతిప్ప, గొల్లవానితిప్ప, దిరుసుమర్రు, వెంప, పెదగరువు, కోమటితిప్ప నార్త్‌ తదితర గ్రామాలలో సుమారు 12 వేల ఎకరాలలో చేపలు, 5 వేల ఎకరాలలో వనామీ రొయ్యల పెంపకం సాగిస్తున్నారు. అలాగే తాడేరు, బేతపూడి, రాయలం, యనమదుర్రు, తుందుర్రు, నరసింహపురం తదితర గ్రామాలలో సుమారు 7,200 ఎకరాలలో సార్వా (ఖరీఫ్‌) సాగు చేపట్టారు. చేలన్నీ మరో వారం, పది రోజుల్లో కోతకు వస్తాయన్న తరుణంలో తుపాన్లు రైతుల ఆశలను గల్లంతు చేశాయి. తుపాను ప్రభావంతో వీచిన బలమైన ఈదురు గాలులకు చేపలు, రొయ్యల చెరువుల గట్లు కోతకు గురై గండ్లు పడటంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోక ముందే, తాజాగా ఆక్వాన్‌ తుపాను తీవ్ర రూపం దాల్చి మచిలీపట్నం ప్రాంతంలో తీరం దాటుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి.

రైతు గుండెల్లో గుబులు

ఈ ఖరీఫ్‌లో రైతులు పెట్టిన పెట్టుబడులు, పడిన కష్టం అంతాఇంతా కాదు. గత తుపాన్ల ప్రభావంతో పంట దెబ్బతినడం, పొలాల్లో నీరు నిల్వ ఉండటం, వరి పైరు నేలకొరగడం వంటి సమస్యలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. కొన్ని గ్రామాలలో రైతులు తమ పొలాల్లోని వరదనీటిని ఆయిల్‌ ఇంజిన్లు, కరెంట్‌ మోటార్లతో బయటకు తోడి, పండిన నాలుగు గింజలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఈనెల 19, 20 తేదీలలో ఆక్వాన్‌ తీవ్ర తుపానుగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల గుండెల్లో గుబులు పుడుతోంది. మళ్లీ ఇప్పుడు పంట నీట మునిగితే తీవ్ర నష్టం తప్పదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిసిపోయి గింజలు మొలకెత్తడం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు.

గత తుపాన్ల కారణంగా చేపలు, రొయ్యల చెరువుల గట్లు తెగిపోయాయి. మరికొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడటంతో జీవులు కాలువల్లోకి వెళ్లిపోయాయి. కొన్నిచోట్ల బలహీనపడిన చెరువు గట్లను మట్టి బస్తాలతో పూడ్చి, చుట్టూ మెస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు విద్యుత్‌ కొరత కారణంగా చేపలు, రొయ్యలు పట్టుబడికి రాకపోయినప్పటికీ ఉన్నకాడికి అమ్మివేసుకున్నారు. వ్యాపారులు ఐస్‌ కొరత, కార్మికులు రాలేదన్న సాకుతో ధరలు తగ్గించేయడంతో తమకు అప్పులే మిగిలాయని ఏ ఆక్వా రైతును కదిలించినా కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పుడు మరో తుపాను వస్తుందన్న వార్తతో మరింత భయాందోళన చెందుతున్నారు.

ఆక్వా, వరి రైతులను వెంటాడుతున్న వరుస తుపాన్లు

ఇప్పటికే అర్నబ్‌, మురసు తుపాన్లతో రైతులకు తీవ్ర నష్టం

మరో తుపాను ఆక్వాన్‌ రాకతో బెంబేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement