గోవింద దీక్ష.. సర్వ జగద్రక్ష | - | Sakshi
Sakshi News home page

గోవింద దీక్ష.. సర్వ జగద్రక్ష

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

ద్వారకాతిరుమల: ఎటుచూసినా పసుపు వస్త్రధారణలో దీక్షాపరులు... అడుగడుగునా గోవింద నామస్మరణలు... భజనలు, సంకీర్తనలతో మార్మోగుతున్న చిన్నతిరుపతి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. నిత్యం తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంతో పులకించిపోతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో గోవింద దీక్షలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షలు స్వీకరిస్తున్నారు. స్వామివారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలతో మాలధారణ చేసి, కఠిన నియమనిష్ఠలను ఆచరిస్తూ గోవింద నామస్మరణలో లీనమవుతున్నారు. నిత్యం భజనలు, హరినామ సంకీర్తనలతో శ్రీవారిని కీర్తిస్తూ ఆధ్యాత్మిక ఆనందానుభూతులను పొందుతున్నారు.

నిత్య పూజలు.. నియమ నిష్ఠలు

గోవింద దీక్ష స్వీకరించిన భక్తులు ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరిస్తున్నారు. పసుపు వస్త్రాలు ధరించి, నుదుట తిరునామం దిద్దుకుని ఆలయానికి చేరుకుంటున్నారు. దీపారాధన మండపంలో దీపాలు వెలిగించి గోవింద నామాలను పఠిస్తున్నారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారి తొలి హారతిని స్వీకరిస్తున్నారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా ఆలయానికి చేరుకుని పూజలు, నామసంకీర్తనలు నిర్వహిస్తున్నారు. దీక్షా కాలమంతా బ్రహ్మచర్యం పాటించడం, సాత్విక ఆహారం తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ దైవచింతనలో గడపడాన్ని ప్రధాన నియమాలుగా పాటిస్తున్నారు.

ఈ నెల 29 నుంచి అర్ధమండల దీక్షలు

శ్రీవారి భక్తులు తమ అభీష్టం, సౌలభ్యాన్ని బట్టి 108 రోజుల మహామండల దీక్ష, ఏడు వారాల వ్రత దీక్ష, 41 రోజుల మండల దీక్ష, 21 రోజుల అర్ధమండల దీక్షలను స్వీకరిస్తుంటారు. ప్రస్తుతం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 29 నుంచి అర్ధమండల దీక్షలు చేపట్టేందుకు భక్తులకు అవకాశం ఉంది. డిసెంబర్‌ 20న ముక్కోటి ఏకాదశి సందర్భంగా దీక్షాధారులు ఇరుముడులతో స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమించాలి. భక్తులు తమ ఆరోగ్య పరిస్థితి, సౌలభ్యాన్ని బట్టి ముక్కోటి ఏకాదశికి 11 లేదా 9 రోజుల ముందు కూడా ఈ దీక్షను స్వీకరించవచ్చు.

చిన్నతిరుపతిలో గోవింద దీక్షల సందడి

భజనలు, గోవింద నామస్మరణలతో మార్మోగుతున్న క్షేత్రం

ఈ నెల 29 నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement