ఖననం చేసిన యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం | - | Sakshi
Sakshi News home page

ఖననం చేసిన యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

ద్వారకాతిరుమల: ఖననం చేసిన పది రోజుల తర్వాత ఓ యువకుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం సంచలనాన్ని రేకెత్తించింది. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన ఓ వివాహిత యువకుడు మృతి చెందిన రెండు రోజులకే ఆత్మహత్యకు పాల్పడటం, వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది. స్థానికుల కధనం ప్రకారం. ఎం.నాగులపల్లికి చెందిన చవటపల్లి రవితేజ(24) ట్రక్కు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 6న భీమవరం కిరాయికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. మృతికి కారణాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అదేరోజు మృతదేహాన్ని ఖననం చేశారు. ఇదిలా ఉండగా.. నాలుగు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకున్న నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన యువతి.. రవితేజ మృతి చెందిన రోజు సాయంత్రం పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 9న అక్కడ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడంతో వీరి మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ గ్రామంలో ప్రచారం మొదలైంది. రవితేజ మృతికి ఆత్మహత్య కాకుండా మరేదైనా కారణం ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు

తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ రవితేజ తల్లి రమణ ఈ నెల 14న ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అదేరోజు రాత్రి కేసు నమోదు చేసిన ఎస్సై టి.సుధీర్‌.. 15న భీమడోలు సీఐ పి.కృష్ణతో కలిసి రవితేజ ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి వైద్య బృందంతో పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్‌ జేవీ సుబ్బారావు, సీఐ కృష్ణ, ఎస్సై సుధీర్‌ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని, అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఎం.నాగులపల్లిలో ఘటన

తల్లి ఫిర్యాదుతో పది రోజుల తర్వాత మృతదేహం వెలికితీత

యువకుడు, వివాహిత మరణాల వెనుక కారణాలపై పోలీసుల దర్యాప్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement