గణపవరం: వ్యసనాలకు బానిసై, భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గణపవరంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం గణపవరం బస్టాండ్ ప్రాంతానికి చెందిన అనుపోజు పవన్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన పవన్‌కుమార్ అప్పులపాలై, భార్యను వేధిస్తుండటంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఆమె పిల్లలతో వేరుగా ఉంటోంది. భార్యను తిరిగి రావాలని పవన్‌కుమార్ ఎంతగా కోరినా ఆమె నిరాకరించింది. దీంతో మనోవేదనకు గురైన అతడు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బస్టాండ్ సమీపంలోని ఓ షెడ్‌లో ఇనుప రాడ్డుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సీఐ రజనీకుమార్, ఎస్సై మణికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
యలమంచిలి: చించినాడ గ్రామానికి చెందిన ఇందుకూరి వెంకట రామరాజు (74) అక్టోబర్ 8 నుంచి కనిపించడం లేదంటూ ఆయన కుమారుడు బదరీ నారాయణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోటూరి రాజ్‌కుమార్ తెలిపారు. రామరాజుకు భార్య రమావతి, కుమారులు శ్రీనివాసరాజు, బదరీ నారాయణరాజు ఉన్నారు. కుమారులు భీమవరంలో స్థిరపడగా, రామరాజు దంపతులు చించినాడలో వ్యవసాయం చేస్తూ నివసిస్తున్నారు. గత కొంతకాలంగా షుగర్, బీపీ, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న ఆయన, నిద్రమాత్రలు వాడుతున్నారు. ఈ క్రమంలో గత నెల 8వ తేదీ రాత్రి భోజనం చేసి దంపతులిద్దరూ నిద్రపోగా, మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు భార్య లేచి చూసేసరికి రామరాజు ఇంట్లో కనిపించలేదు.
కై కలూరు: సచివాలయంలో విధుల్లో ఉన్న నర్సుపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిపై కై కలూరు రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం కై కలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన ఉచ్చుల మౌనిక(26) దొడ్డిపట్లలో ఎంఎల్‌హెచ్‌పీ(నర్సు)గా విధులు నిర్వహిస్తోంది. దొడ్డిపట్ల సచివాలయంలో పంచాయతీ గుమస్తా దివ్యతో కలసి పనిచేస్తుండగా గ్రామానికి చెందిన ఆత్మకూరి నరసింహారావు మద్యం మత్తులో గొడవకు దిగాడు. కొంత సమయానికి వెళ్లిపోయాడు. గుమస్తా దివ్య భోజనానికి వెళ్లిన తర్వాత నరసింహారావు సచివాలయానికి వచ్చి ఒంటరిగా ఉన్న మౌనికపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో సమీప ప్రజలు వచ్చి అతడ్ని పంపించేశారు. మౌనిక ఫిర్యాదుపై రూరల్ ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్తిలి: వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనపై ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కేఎన్ విశ్వనాథ్ తెలిపారు. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామానికి చెందిన పంపన విజయభాస్కరరావు ఈనెల 16న పనినిమిత్తం మంచిలి గ్రామానికి వచ్చి, రోడ్డుపక్కన ఖాళీ ప్రదేశంలో స్కూటర్‌ను పార్కుచేసి ఉంచగా, ఎదురుగా ఉన్న ఇంటినుంచి సత్తి దుర్గారెడ్డి, సుబ్బిరెడ్డి వచ్చి బండిని ఎందుకు ఇక్కడ పార్కు చేశావంటూ, విజయభాస్కరరావును దౌర్జన్యంగా రాళ్లతో కొట్టి గాయపర్చారు. దీంతో గాయపడిన విజయభాస్కరరావును స్ధానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.


