ఏలూరు టౌన్: ఏలూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము దుర్వినియోగమైందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో ఏలూరు రేంజ్ ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో మంగళవారం కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ తనిఖీలు రెండు, మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏలూరు నగర కమిషనర్ భానుప్రతాప్‌తో సమావేశమై కార్పొరేషన్ రెవెన్యూ రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బందిని విచారిస్తున్నారు. నగరంలో పన్నుల చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తుండగా, ప్రాథమికంగా రూ.1.30 కోట్లు దుర్వినియోగమైనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా ప్రజల సొమ్ము ఎంతమేర దుర్వినియోగమైందనే దానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ ప్రజాధనం దుర్వినియోగంలో ఎవరి పాత్ర ఏంటనే కోణంలో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో ఏసీబీ సీఐలు శ్రీనివాస్, బాలకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
దర్యాప్తులో అసలు దొంగలు పట్టుబడతారా?
ఏలూరు నగరవాసులు నగరాభివృద్ధికి పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము దుర్వినియోగం కావడంపై తీవ్ర దుమారం చెలరేగింది. తొలుత రూ.1.30 కోట్లుగా చెబుతున్నప్పటికీ, వాస్తవానికి రూ.3 కోట్లకు పైగానే అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. వీటితోపాటు కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలోనూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ఇంజనీరింగ్ విభాగంలోనూ భారీఎత్తున నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారనే అభియోగాలు పాలకులు, అధికారులపై వచ్చాయి. ఇలా రెండున్నరేళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనం కాజేశారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ విభాగంలో నిధుల దుర్వినియోగంలో సిబ్బంది చేతివాటం ఎంత? అధికారుల పాత్ర ఏమిటి? ఇందులో పాలకుల భాగస్వామ్యం ఉందా? అనే విషయాలు ఏసీబీ దర్యాప్తులో వెల్లడి కావాలని నగర ప్రజలు కోరుతున్నారు.
ఏలూరు కార్పొరేషన్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము గోల్‌మాల్‌పై ఆరా
రూ.1.30 కోట్లు దుర్వినియోగంపై ప్రాథమిక నిర్థారణ
రెండు, మూడు రోజులపాటు ఏసీబీ విచారణ


