శివం శంకరం.. శుభకరం | - | Sakshi
Sakshi News home page

శివం శంకరం.. శుభకరం

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

● హర నామ స్మరణతో మార్మోగిన పంచారామ క్షేత్రాలు

● కార్తీక మాసం మొదటి సోమవారం భారీగా తరలివచ్చిన భక్తులు

భీమవరం (ప్రకాశం చౌక్‌): పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భీమవరం పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం శివనామ స్మరణతో మారుమోగింది. ఆలయంలో కొలువైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి దివ్య దర్శనం కోసం జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పంచారామ యాత్రికులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు భక్తిశ్రద్ధలతో కార్తీక నోములు నోచుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు స్వామివారికి నిర్విరామంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, విశేష అలంకరణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం, దాతల సంయుక్త ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

క్షీరారామంలో ప్రత్యేక పూజలు

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామ క్షేత్రాలలో శిరోభాగంగా విరాజిల్లుతున్న పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మొదటి సోమవారం భక్తజన సంద్రమైంది. వేకువజాము నుంచే భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. అనంతరం కెనాల్‌ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర స్వామి, దాసోహాంజనేయ స్వామి వార్లను దర్శించుకుని క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నారు.

పోటెత్తిన భక్తులు

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లు, అభిషేక మండపం, ఆలయ వెనుక భాగం కిక్కిరిసిపోయాయి. అభిషేకాలు చేయించుకునే భక్తులు మహన్యాస పారాయణంలో భక్తితో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి పంచారామ యాత్రికుల తాకిడి మరింత పెరిగింది. ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకున్న యాత్రికులు అనంతరం అమరావతి, భీమవరం క్షేత్రాలను దర్శించి ఆ తరువాత క్షీరారామానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే పాలకొల్లు, పరిసర గ్రామాల భక్తులు పై నాలుగు క్షేత్రాలను దర్శించుకుని రాత్రి 8 గంటల సమయానికి క్షీరారామలింగేశ్వరుని దర్శనంతో తమ యాత్రను పరిపూర్ణం చేసుకున్నారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు, చైర్మన్‌ మీసాల రామచంద్రరావు, పట్టణ సీఐ కె. రజనీకుమార్‌ పర్యవేక్షణలో పోలీసు, ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు భక్తులకు విశేష సేవలు అందించారు.

నంది వాహనంపై మల్లేశ్వరుని గ్రామోత్సవం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శివయ్యకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష పూజాధికాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ఆవరణలోని ఉసిరి చెట్ల వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించి భక్తిప్రపత్తులను చాటుకున్నారు. సాయంత్రం గంగా, పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారు నంది వాహనంపై అధిరోహించి క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement