తాడేపల్లిగూడెం: తేనె వినియోగం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ కె. ధనుంజయరావు తెలిపారు. విశ్వవిద్యాలయం, కేవీకే సంయుక్త ఆధ్వర్యంలో వెంకట్రామన్నగూడెంలో తేనెటీగల పెంపకంపై శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, తుపానుల వల్ల తేనెటీగల పెంపకంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. రైతుల ఆర్థికాభివృద్ధికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) ఎంతో కీలకమని, తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు బీ బాక్సులను అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ చలపతిరావు మాట్లాడుతూ పంటల్లో పరపరాగ సంపర్కం జరగడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. మైనం ద్వారా తయారుచేసే విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి డాక్టర్ ఇమ్మానుయేల్ వివరించారు. తేనె ఉత్పత్తి ద్వారా నెలకు రూ.10 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముందని డాక్టర్ సూర్యకుమారి, డాక్టర్ రూత్, డాక్టర్ ప్రసన్నకుమార్ తదితరులు పేర్కొన్నారు.


