ఏలూరు (టూటౌన్): జిల్లాలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్ చెప్పారు. స్థానిక పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురం గ్రామంలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని, రేషన్ దుకాణాల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేశామని, బియ్యం నిల్వలలో వ్యత్యాసం కనపడలేదన్నారు. రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యాన్ని కార్డుదారులు ఎవరైనా బయట వ్యక్తులకు అమ్మితే వారి కార్డులను రద్దు చేస్తామని డీఎస్‌ఓ హెచ్చరించారు. గతంలో చింతలపూడి పరిసర ప్రాంతాలలో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌పై ఫిర్యాదులు వచ్చాయని, వారిపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 9 ధరణి కేంద్రాల ద్వారా బీపీటీ సన్న బియ్యాన్ని రాయితీ ధరపై ప్రజలకు అందిస్తున్నామన్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ ధరణి కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఎస్‌ఓ బాబు విలియమ్స్ చెప్పారు.


