ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న పలువురు స్కేటింగ్ క్రీడాకారులు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. కాకినాడలో నిర్వహించిన స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో వివిధ విభాగాల కింద క్రీడాకారులు పతకాలు సాధించారు. 6–8 ఏళ్ల వయో విభాగం రింక్–2 పోటీల్లో మల్ల లక్ష్మీ సృజతి బంగారు పతకం, 12–15 ఏళ్ల రోడ్–1 విభాగంలో పుచ్చల యువన్ సాయి మణికాంత్ రజత పతకం కై వసం చేసుకున్నారు. అలాగే, 10–12 ఏళ్ల గ్రూప్ రింక్ విభాగంలో ఎం. శ్రీ భువన్ కాంస్య పతకం గెలుచుకోగా, స్పెషల్ కిడ్స్ విభాగంలో దేవదాసు క్రాంతి నిహాల్ రింక్–2, రింక్–3 పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించాడు. మరోవైపు, తణుకులో జరిగిన రోలర్ హాకీ జూనియర్ బాలుర విభాగంలో ఎన్. లిఖిల్ కాంస్య పతకం సాధించాడు. పతకాలు గెలిచిన క్రీడాకారులతో పాటు, వారి కోచ్ షేక్ ఖాసింను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ. అజీజ్, సెట్‌వెల్ సీఈఓ కేఎస్. ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు.


