పరిహారంలో పచ్చరాబందులు | - | Sakshi
Sakshi News home page

పరిహారంలో పచ్చరాబందులు

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

● గ్రామసభలు లేకుండానే.. వివాదం లేని భూములు సేకరించాలి దళారుల కన్ను

ముగ్గురు దళారులు.. రూ.15 కోట్ల వసూళ్లు !

బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో గిరిజనుల సాగులో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌లో సేకరించిన భూములు

రెడ్డిగణపవరం పరిధిలోని భూములను పోలవరం నిర్వాసితుల కోసం అధికారులు గ్రామసభలు నిర్వహించడకుండా, ప్రజా తీర్మానాలు లేకుండా సేకరించారు. ఈ భూముల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉంది. భూములిచ్చిన రైతుల నుంచి ఖాళీ చెక్కులను తీసుకున్నారు. ఈ విషయంపై సిట్‌తో విచారణ జరిపించాలి.

–ఎం.మంగరాజు, సీపీఎం నాయకుడు, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం

ఏజెన్సీలో 1/70 వచ్చిన భూములను 30 ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ప్రస్తు తం గిరిజనులు ఉన్నా భూసేకరణ అధికారులు కొనుగోలు చేశారు. వీటిని కేటాయించడం వల్ల గిరిజనులకు, నిర్వాసితులకు మధ్య కొట్లాట జరిగే అవకాశం ఉంది. అధికారులు వివాదం లేని భూములను సేకరించాలి.

– జి.పవన్‌కుమార్‌, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం భూసేకరణపై దళారుల కన్ను పడింది. భూములిచ్చిన రైతుల నుంచి కమీషన్లు మాట్లాడుకుని అధికారుల అండదండలతో ఆ సొమ్ములను పోగేసుకుంటున్నారు. దీనిపై జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.

– భూమరాజు సత్యనారాయణ రాజు, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం

పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన గిరిజనులను కూటమి నేతలు దోచుకుంటున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అందిన పరిహారంలో దండుకుంటున్నారు. తాజాగా పూర్తయిన పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ భూసేకరణకు సంబంధించి రైతుల ఖాతాల్లో జమైన రూ.1,500 కోట్లలో కొంత భాగం దళారుల పాలుకావడం తీవ్ర కలకలం రేపింది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని గిరిజనేతరులకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కట్టబెట్టారని ఆయనపై సీబీసీఐడీ విచారణ చేయాలని గిరిజనులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సాక్షి ప్రతినిధి,ఏలూరు : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 2,500 ఎకరాల భూమిని ప్రభుత్వం తాజా గా సేకరించి దీనిలో ఎకరాకు రూ.15 లక్షల చొ ప్పున పరిహారాన్ని ప్రకటించింది. దీనికి గానూ 1,000 ఎకరాలకు సంబంధించి రూ.1,500 కోట్లు సంబంధిత రైతుల ఖాతాల్లో జమైంది. పూర్తిగా భూసేకరణ చట్టాన్ని తూట్లు పొడిచేలా అధికారులు వ్యవహరించి అడ్డగోలుగా గ్రామాల వారీగా దళారులను ఏర్పాటు చేసుకుని రైతుల పరిహారంలో సింహాభాగం స్వాహా చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు డివిజన్‌ పరిధిలో ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వడానికి ఈ సేకరణ పూర్తి చేశారు. దీనిని అధికారులతో పచ్చ పార్టీ, జనసేన పార్టీ నేతలు కుమ్మకై ్క దోపిడీ కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం భూసేకరణ నిర్వహించడానికి ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం పొంది, అనంతరం ఈ భూమికి ఎలాంటి సమస్యలు లేవని, పీసా చట్టం అమలు చేసే కమిటీ ద్వారా ఎన్‌ఓసీ తీసుకోవాలి. తదనంతరం పోల వరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నేతృత్వంలో భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిలో సంబంధిత మండలాల తహసీల్దార్లు రికార్డులు పరిశీలించి ఖరారు చేశాక భూసేకరణ పూర్తి చేసి ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.15 లక్షల చొప్పున నగదు జమ చేస్తారు. అయితే ఈ రెండు మండలాల్లో ఎలాంటి గ్రామసభలు గాని, పీసా చట్టం కమిటీ అనుమతి లేకుండా బలవంతపు సేకరణ నిర్వహించారు. దీనిని అధికారులు ఆదాయ వనరుగా మలుచుకున్నారు.

అధికారిపై ఫిర్యాదు

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జి.శ్రీనుకుమార్‌పై బుట్టాయగూడెం మండలానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ నిర్వహించాలని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వికి ఫిర్యాదులు పంపారు. బుట్టాయగూడెం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన బుగ్గల నాగేంద్రబాబు 12.33 ఎకరాల భూమిని గిరిజనేతరుల పేరిట స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్డర్‌ ఇచ్చారని, అలాగే కుమ్మరికుంటకి చెందిన మరో రైతు సరియం గోపాలకృష్ణ, కారం బుచ్చిరాజు, సరియం బుచ్చిరాజులు తమ భూములను ఎలాంటి సభలు నిర్వహించకుండా గిరిజనేతరుల పేర్లతో అక్రమాలకు పాల్పడి అధికారి ఆర్డర్‌ ఇచ్చారని సీబీసీఐడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు.

తమకు పట్టాలున్నా ఆర్‌అండ్‌ఆర్‌ భూసేకరణలో వేరే వారి పేర్లు ఉన్నాయంటున్న గిరిజనులు

కూటమి కనుసన్నల్లో..

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌లో దళారుల దందా వివాదం ఉంటే ఎకరాకు రూ.5 లక్షలు లేకుంటే రూ.3 లక్షల వసూలు దళారీ దరఖాస్తులకే అధికారుల ఆమోద ముద్ర రెండు మండలాల్లో వెయ్యి ఎకరాలకు రూ.1,500 కోట్ల పరిహారం జమ గిరిజన భూములను గిరిజనేతరులకు కట్టబెట్టారని ఆరోపణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేసిన గిరిజనులు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌పై విచారణకు డిమాండ్‌

కూటమిలోని జనసేన, టీడీపీ నేతలు దళారుల అవతారం ఎత్తి బుట్టాయగూడెం మండలంలోని రెడ్డిగణపవరం, దొరమామిడి, కె.రాజమండ్రి, జీలుగుమిల్లి మండలంలో రౌతుగూడేనికి చెందిన గిరిజనుల భూములను టార్గెట్‌ చేశారు. భూముల్లో వివాదం ఉంటే రూ.5 లక్షలు, లేదంటే రూ.3 లక్షలు దళారీ రేట్లు నిర్ణయించి వారే పరిహారానికి సంబంధించి పత్రాలన్నీ ఫైల్‌గా తీసుకువెళ్లి అధికారులతో బేరం మాట్లాడుకుని రైతుల నుంచి ఖాళీ చెక్కులను తీసుకుని పరిహారం ఖాతాల్లో జమకాగానే చెక్కులు బ్యాంకులో క్లియర్‌ చేసుకుంటున్నారు. ఇలా ముగ్గురు దళారులు రూ.15 కోట్లకుపైనే వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో జనసేన నేత కరాటం రాంబాబు పోలవరం పరిహారంలో అక్రమాలకు పాల్పడి గిరిజనుల కడుపు కొడుతున్నారని విమర్శించారు. తాజాగా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దళారులు రైతుల నుంచి వసూళ్లకు పాల్పడిన ఘటనపై ఎస్పీ, కలెక్టర్‌, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ అండ లేకుండా వసూళ్లు ఎలా సాగుతాయనేది చర్చ కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement