కలిదిండి(కైకలూరు) : కలిదిండి మండలంలోని కోరుకొల్లులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు ఇంటి ముందు గుర్తుతెలియ ని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఈ ఘటన ఈనెల 1న అర్ధరాత్రి 1.30 గంటలకు జరిగింది. సీసీ ఫుటేజ్‌ల్లో దాడి స్పష్టంగా తెలుస్తోంది. ఉదయం పనిమనిషి చెట్లు కాలిపోవడాన్ని గుర్తించి యజమానికి చెప్పడంతో ఆయన పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తనను హతమార్చడానికి రెక్కీ నిర్వహించినట్టు భావిస్తున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కలిదిండి ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ పుటేజ్‌ల ఆధారంగా విచారణ చేస్తున్నామని, మొత్తం ముగ్గురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నట్టు భా విస్తున్నామన్నారు. ఇది ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన ఘటనగా కనిపిస్తోందన్నారు. కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయి విచారణ చేసి దోషులను గుర్తిస్తామని ఎస్సై చెప్పారు.


