● సేకరణలో నాయక్‌పోడు గిరిజనులు
● ఇదే వీరికి జీవనాధారం
● చేపలు పట్టే మావుల తయారీకి వినియోగం
బుట్టాయగూడెం : అటవీ ప్రాంతంలో చెట్లపైకి పాకే.. పొదల్లో ఉండే నల్లతీగను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు నాయక్‌పోడు గిరిజనులు. ఏటా ఈ సమయంలో వీరు నల్ల తీగను సేకరించి కట్టలుగా కట్టి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. నల్లతీగ సేకరణ కష్టంతో కూడుకున్నది కావడంతో పాటు ప్రమాదకరం. జంతువులు, విషసర్పాలను తప్పించుకుని సేకరించాల్సి ఉంటుంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురం కొవ్వాడ ప్రాజెక్టు ముంపు పునరావాస గ్రామం. ఇక్కడ సుమారు 50 కు టుంబాలకు చెందిన నాయక్‌పోడు గిరిజనులు జీవిస్తున్నారు. వీరిలో 30 కుటుంబాలు అడవిలో లభించే నల్లతీగ, చింతపండు, కుంకుళ్లు, వేప గింజలు వంటి ఉత్పత్తులను సేకరించి, విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నల్లతీగ సేకరణ కోసం సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకూ అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. పొదల్లోను, చెట్లకు అల్లుకున్న తీగలను సేకరించి తలపై పెట్టుకుని ఇళ్లకు తీసుకువస్తుంటారు. తీగల సేకరణలో కొందరు కళ్లు పోగొట్టుకున్న సంఘటనలూ ఉన్నాయి.
రోజుకు రూ.500
● రోజూ సేకరించిన నల్లతీగలను ఇంటి వద్దకు తీసుకువచ్చి కట్టలుగా చుట్టి కట్ట రూ.25 చొప్పున విక్రయిస్తారు. ఇలా రోజుకు సుమారు 25 కట్టలకు రూ.625 వస్తే వాటిలో రూ.125 ఖర్చులు పోను రూ.500 మిగులుతాయని మహిళలు చెబుతున్నారు. ఒక్కోసారి తీగ దొరక్కపోతే ఖాళీ చేతులతో రావాల్సి వస్తుందని అంటున్నారు.
● నల్లతీగ చాలా గట్టిగా ఉంటుంది
● కొల్లేరు ప్రాంతంలో చేపలు పట్టేందుకు బుట్టల తయారీలో వినియోగిస్తారు.
● తీగలను రెండు రోజుల పాటు నీటిలో నానబెట్టి, వెదురు పుల్లలను కలిపి మావులను తయారు చేస్తారు.
● ఈ మావులను 3 నెలల పాటు చేపలు పట్టేందుకు వినియోగిస్తారు.
● వ్యాపారులు గిరిజనుల వద్దకు వచ్చి వీటిని కొనుగోలు చేస్తుంటారు.
● ఆకివీడు సమీపంలోని దుంపగడపలో నల్లతీగ వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు.


