పాలకొల్లు సెంట్రల్ : న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలని పాలకొల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాముల చిట్టిబాబు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం నుంచి శుక్రవారం వరకు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారన్నారు. పాలకొల్లులో సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి కోర్టు ఆవరణలో నిరసనలు కొనసాగు తాయన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి మెమొరాండం సమర్పిస్తామన్నారు. న్యాయవాదులంతా పాల్గొనాలని కోరారు. బార్ అసోసియేషన్ సెక్రటరీ ముత్యాల రంగారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్‌కే రామలింగేశ్వరరావు, ట్రెజరర్ కె.నాగదుర్గావతి, సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి సందర్శన
పాలకొల్లు కోర్టును జిల్లా జడ్జి వాసంతి సందర్శించారు. ఆమెను బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. న్యాయమూర్తులు వి.శ్రీనివాసరెడ్డి, వీఎస్‌ఎన్ లావణ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం : పట్టణంలో సెలవు రోజుల్లో స్క్రీనింగ్ స్కాలర్‌షిప్ టెస్ట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తూ పిల్లలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆయా సంస్థల్లో పరీక్షలను వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భీమవరం పట్టణ కమిటీ అధ్యక్షుడు పి.సాయికృష్ణ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం 2007 ప్ర కారం ఏ విద్యాసంస్థలు అయినా పిల్లాడి అడ్మిషన్ కోసం ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించరాదన్నారు. అ యితే కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను స్క్రీనింగ్ టెస్టుల పేరుతో వారి వి ద్యాసంస్థలకు తీసుకువచ్చి పరీక్షలు నిర్వహిస్తే రానున్న కాలంలో చర్యలు కఠినంగా ఉంటా యని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ కమిటీ సభ్యులు జి.కౌశిక్, పి.త్రినాథ్, జి.షణ్ముఖ, జి.అభి పాల్గొన్నారు.
నరసాపురం : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సీపీఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ తెలిపారు. ఆదివారం స్థానిక అల్లూరి కల్యాణ మండపంలో జరిగిన సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాల్లో పార్టీ పోటీచేయాలని నిర్ణయమని చెప్పారు. కాళీపట్నం జమిందారీ భూములు అర్హులైన పేదలకు పంచాలన్నారు. భూ స్వాముల చేతుల్లో పెద్ద సంఖ్యలో భూములు ఉన్నాయన్నారు. ప్రస్తుతం కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే సజావుగా చేయాలని, అర్హులైన పేద రైతులకు అన్యాయం జరగకూడదని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోపాలన్, కార్యదర్శివర్గ సభ్యుడు కవురు కవురు పెద్దిరాజు, పొగాకు పూర్ణ పాల్గొన్నారు.


