విద్యుత్ ప్రమాదాలపై అవగాహన ముఖ్యం
● వర్షాకాలంలో విద్యుత్ తీగలు, మోటార్లతో అప్రమత్తంగా ఉండాలి
● నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణానికే ముప్పు
● చిన్నపాటి జాగ్రత్తలతో ప్రమాదాలకు అడ్డుకట్ట
యలమంచిలి: అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులు తమ పొలాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. పంటలకు నీరు పెట్టడం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ తీగలు, మోటార్ల వద్దే ఎక్కువగా గడుపుతుంటారు. కొందరు రైతులు చిన్న చిన్న విద్యుత్ మరమ్మతులను స్వయంగా చేస్తుంటారు. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు వహించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. పొలాల్లో కర్ర స్తంభాలు, వేలాడుతున్న తీగల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
స్టార్టర్లతో జాగ్రత్తలు ఇలా..
స్టార్టర్ డబ్బాలను మోటార్ పక్కనే పొలంలో ఉంచి వాటికి కవర్లు కప్పుతుంటారు. ఇది ప్రమాదాలకు తావిస్తుంది. వర్షం కురిసినా, బోరు నీరు ఎగజిమ్మినా డబ్బాల్లోకి నీరు చేరుతుంది. అంతేకాకుండా విద్యుత్ తీగలు గజిబిజిగా ఉండి, తెగిపోయిన చోట మళ్లీ అతికిస్తుంటారు. అసలు ఏ తీగ ఏ ఫీజుదో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. నేరుగా స్టార్టర్‌కు విద్యుత్ సరఫరా అయ్యేలా సరైన ఫీజును అమర్చుకోవాలి. చాలా మంది రైతులు ఇప్పటికీ స్టార్టర్ల కోసం ఇనుప డబ్బాలనే ఉపయోగిస్తున్నారు. ఇనుప డబ్బాల్లో స్టార్టరు, ఫీజులు బిగించడం వల్ల ఎలుకలు డబ్బాలో చేరి తీగలు కొరుకుతుంటాయి. దీంతో తీగలు తెగి డబ్బాకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఇది గమనించక రైతులు డబ్బాను పట్టుకోగానే షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
విద్యుత్ తీగలతో ప్రమాదం..
గాలివానకు ఒక్కోసారి పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడుతుంటాయి. ఆ సమయంలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే, వ్యవసాయ పనులు ముగించుకుని మోటార్ వైర్లను ఇంటికి తీసుకువెళుతుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఆ వైర్లను ఎలుకలు కొరికే అవకాశం ఉంది. మరుసటి రోజు మోటర్‌కు ఆ వైర్లు తగిలించేటప్పుడు వాటిని సరిగ్గా పరిశీలించాలి. పాత వైర్ల కంటే కొత్త వైర్లను బిగించుకోవడం ఎప్పుడూ సురక్షితం. విద్యుత్ స్తంభాలు దూరంగా ఉన్న పొలాల్లో కొందరు కర్రల సహాయంతో తాత్కాలికంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇవి వర్షానికి, గాలికి కిందపడుతుంటాయి. వాటిని గమనించకుండా పొలాల్లోకి వెళితే కాళ్లకు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, విద్యుత్ అధికారులతో మాట్లాడి శాశ్వతంగా స్తంభాలను ఏర్పాటు చేయించుకోవాలి.
పాటించాల్సిన జాగ్రత్తలు
పొలాల్లో మోటార్లు పనిచేయకపోతే చేతితో నేరుగా పట్టుకోకూడదు.
టెస్టర్ సహాయంతో మాత్రమే విద్యుత్ సరఫరాను పరీక్షించాలి.
వర్షపు నీరు, తేమ తగలని చోట మోటార్లను అమర్చాలి.
ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
విద్యుత్ మోటార్లలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే ముందుగా ప్రధాన విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి.
ఫీజులు పోతే విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతో వాటిని మరమ్మతు చేయించుకోవాలి.
వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. కరెంటు తీగలు తాకుతున్న చెట్లను ముట్టుకోవద్దు. పొలాల్లో స్టార్టర్లు మరమ్మతులకు గురైతే ఎలక్ట్రీషియన్‌తో మాత్రమే చేయించుకోవాలి. స్వయంగా ఫీజులు వేయడం వంటి పనులు చేయరాదు. పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుంటే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలి. విద్యుత్ ప్రమాదాలపై రైతులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ అవగాహన పెంచుకోవాలి.
– వి. చండీ కిరణ్, ఎలక్ట్రికల్ ఏఈ, యలమంచిలి


